Begin typing your search above and press return to search.

మధ్యంతరమా... ముందస్తా.. .వేడి రాజుకుంటోందా... ?

By:  Tupaki Desk   |   9 March 2022 7:29 AM GMT
మధ్యంతరమా... ముందస్తా.. .వేడి రాజుకుంటోందా... ?
X
ఏపీలో వచ్చే ఎన్నికలు మధ్యంతరమా ముందస్తా అన్నది ఎవరికీ అంతు పట్టడంలేదు. మధ్యంతరానికి ముందస్తుకు తేడా ఏంటి అంటే టెక్నికల్ గా చూస్తే చాలా ఉంది. ఎన్నికలకు రెండేళ్ళ దాకా వ్యవధి ఉండి సడెన్ గా సభను రద్దు చేసి ఎలక్షన్స్ కి వెళ్తే దాన్ని మధ్యంతరం అంటారు. అదే ఎన్నికలు ఏడాది లోపు ఉండగా ఎన్నికలకు వెళ్తే ముందస్తు అంటారు. గతంలో ఏపీలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి, ముందస్తు ఎన్నికలూ జరిగాయి.

1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీయార్ 1984లో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు తరువాత సభను రద్దు చేసి మధ్యతర ఎన్నికలకు వెళ్లారు. నిజానికి 1988 దాకా ఎన్టీయార్ కి నాడు టైమ్ ఉంది.

ఇక అదే ఎన్టీయార్ 1990 మార్చి వరకూ గడువు ఉండగా నాలుగు నెలల ముందు అంటే 1989 డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్ళి ఓడిపోయారు. దాన్ని ముందస్తు అంటారు. ఇక చంద్రబాబు కూడా ఆరు నెలల ముందు అంటే 2004 అక్టోబర్ వరకూ టైమ్ ఉండగా అదే ఏడాది మేలో ఎన్నికలకు వెళ్ళి ఓడిపోయారు. అది కూడా ముందస్తే. ఇక విభజన తరువాత తెలంగాణాలో కె చంద్రశేఖరరావు ఆరు నెలల ముందు అంటే 2019 మే లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 2018 చివరలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి గెలిచారు

ఇపుడు ఏపీలో చూస్తే జగన్ చేతిలో కచ్చితంగా రెండేళ్ళకు పైగా టైమ్ ఉంది. దాంతో ఆయన కనుక ఎన్నికలకు వెళ్తే దాన్ని మధ్యంతర ఎన్నికలుగానే చూడాలి. అంటే అధికారం కోసం అతి పెద్ద జూదం ఆడడం అన్న మాట. సాధారణంగా భారీ ఎత్తున సింపతీ ఉంటేనే తప్ప మధ్యంతరానికి ఎవరూ వెళ్లరు. సో ఏపీలో పొలిటికల్ గా అలాంటి సీన్ అయితే లేదు.

ఇక మరో వైపు చూస్తే రాష్ట్రపతి ఎన్నికల వేళ సాధార‌ణంగా దేశంలో ఎక్కడా ఏ అసెంబ్లీ కూడా రద్దు చేయడం కానీ సుషుప్త‌ చేతనావ‌స్థలో ఉంచడం కానీ జరగ‌దు. ఎమ్మెల్యేల ఓట్లు చాలా ఇంపార్టెంట్. అవే ప్రెసిడెంట్ ఎలక్ట్రోరల్ కాలేజిలో కీలకం. దాంతో ఎక్కడ ఖాళీలు ఉన్నా ఉప ఎన్నికలు కూడా ఈ మధ్యలో పెడతారు.

ఇక ఆ విధంగా చూస్తే ఈ ఏడాది అగస్ట్ లో ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. అంటే మొత్తానికి చూస్తే ఈ ఏడాదిలో ఏ రకమైన ఎన్నికలు జరిగే వీలు అయితే పక్కాగా లేదు. మరోవైపు చూస్తే వైసీపీకి ముందస్తు ఆలోచనలు లేవని అంటున్నారు. ఎందుకంటే ఇంకా చాలా ఇష్యూస్ పెండింగులో ఉన్నాయి. కొన్ని అయినా చేసి జనాల ముందుకు రావాలని అనుకుంటున్నారు.

అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ ఆలోచనలు ఏంటి అన్నది ఉత్తరాది ఎన్నికల ఫలితాల తరువాత తెలుస్తుంది. యూపీలో బీజేపీ మంచి మెజారిటీతో గెలిచినా బొటాబొటీతో గెలిచినా కూడా మోడీ సర్కార్ ముందస్తు మంత్రం పఠించడం ఖాయమని అంటున్నారు. ఒకవేళ అక్కడ బొమ్మ తిరగబడి విపక్షం గెలిస్తే మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని అంటున్నారు.

యూపీ అన్నది బీజేపీకి గుండెకాయ లాంటిది. అందువల్ల యూపీలో బీజేపీ గెలిస్తే మాత్రం దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అది కూడా ఇప్పుడు కాదు, 2023 మే తరువాతనే అంటే. మరో బడ్జెట్ ని కూడా కేంద్రం ప్రవేశపెట్టి అపుడు నింపాదిగా వెళ్తుంది అని తెలుస్తోంది.

అలాంటి సందర్భంలో మోడీతో పాటే ఏపీ కూడా ముందస్తు బాట పట్టవచ్చు. అదే తీరున తెలంగాణా కూడా సై అనవచ్చు. అంటే టోటల్ గా చూసుకుంటే ముందస్తుకే చాన్స్ ఉంది కానీ మధ్యంతరానికి లేనే లేదు. అది కూడా మరో ఏడాది తరువాతనే. మరిపుడు ఎందుకు ఈ ఎన్నికల ప్రకటనలు అంటే అవన్నీ విపక్షాల పక్కా రాజకీయ వ్యూహంలో భాగనే అంటున్నారు.