Begin typing your search above and press return to search.

ఇలాంటి మ‌చ్చ‌లు మీద‌కు తెచ్చుకోవ‌ద్దు జ‌గ‌న్‌!

By:  Tupaki Desk   |   26 Jun 2019 3:37 PM IST
ఇలాంటి మ‌చ్చ‌లు మీద‌కు తెచ్చుకోవ‌ద్దు జ‌గ‌న్‌!
X
పాల‌నాప‌రంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ.. తాను త‌ర‌చూ ప్ర‌స్తావించే రాజ‌న్న రాజ్యం ఎలా ఉంటుందో చూపించే ప్ర‌య‌త్నంలో త‌ల‌మున‌క‌లై ఉన్నారు జ‌గ‌న్‌. రాజ‌కీయ క‌క్ష‌ల‌కు త‌న వ‌త్తాసు ఉండ‌ద‌ని.. త‌ప్పు చేసిన ఎమ్మెల్యేలైనా స‌రే వారి విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలంటూ తేల్చి చెబుతున్నారు జ‌గ‌న్‌. న్యాయం విష‌యంలో త‌ర త‌మ భేదాలు వ‌ద్దొని స్ప‌ష్టం చేస్తున్న ఆయ‌న‌.. త‌ప్పుడు ప‌నులు చేసే వాళ్లు అధికారపార్టీకి చెందినోళ్లు అయినా స‌రే వ‌ద‌లొద్దంటూ పోలీసు బాసుల‌కు జ‌గ‌న్ తాజాగా చెప్ప‌టాన్ని మ‌ర్చిపోలేం.

పాల‌న‌ను కొత్త పుంత‌లు తొక్కించి.. ఏపీ ప్ర‌గ‌తి కోసం క‌మిట్ మెంట్ తో ప‌ని చేస్తున్న జ‌గ‌న్ కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి నెట్టే ప‌రిణామాలు అప్పుడ‌ప్పుడు ఎదుర‌వుతున్నాయి. తాజాగా ఇలాంటి ఉదంత‌మే ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గురించి విన్నంత‌నే పార్టీలు మ‌రిచి ప్ర‌తి ఒక్క‌రూ అయ్యో పాపం.. ఇలా జ‌ర‌గొద్దే అన్న భావ‌న క‌లుగుతుంది. రాజ‌కీయ క‌క్ష‌లు ఎన్ని ఉన్నా.. శ్రుతిమించిపోయేలాంటి వారి విష‌యంలో క‌ఠినంగా ఉండాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్ కు ఉంది.

లేదంటే.. ఎంతో విజ‌న్ తో చేస్తున్న మంచి ప‌నుల‌కు అర్థం లేకుండా పోవ‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వంపై నింద‌లు ప‌డే ప్ర‌మాదం పొంచి ఉంది. ఇలాంటి వాటి విష‌యంలో క‌ఠినంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ విష‌యం అంద‌రికి అర్థ‌మ‌య్యేలా జ‌గ‌న్ చ‌ర్య ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌కాశం జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘ‌ట‌న విష‌యానికి వ‌స్తే.. ఒక మ‌హిళ‌ను న‌డి రోడ్డు మీద వివ‌స్త్ర‌ను చేసి.. అడ్డుకోపోయిన భ‌ర్త‌ను.. ఇద్ద‌రు పిల్ల‌ల్ని ప‌క్క‌కు ఈడ్చేశారు. అవ‌మానం భ‌రించ‌లేని ఆ మ‌హిల ఉరి వేసుకొని మ‌ర‌ణించిన వైనం సంచ‌ల‌నంగా మారింది.

కుటుంబ వివాదం కాస్తా ఇప్పుడు రాజ‌కీయ రంగు పులుముకుంది. ప్ర‌కాశం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోని వివ‌రాల‌కు వెళితే..టీడీపీలో చురుగ్గా ప‌ని చేసే మ‌హిళా నేత ప‌ద్మ‌. ప్ర‌కాశం జిల్లా చిన‌గంజాం మండ‌లం మోటుప‌ల్లి పంచాయితీ రుద్ర‌మాంబ‌ర‌పురంలో ఆమె నివాసం. మ‌త్స‌కార కుటుంబానికి చెందిన బ్ర‌హ్మ‌య్య భార్య ప‌ద్మ‌. వీరిద్ద‌రూ టీడీపీలో చురుగ్గా ప‌ని చేస్తుంటారు.

ఇదిలా ఉంటే బ్ర‌హ్మ‌య్య సోద‌రులు ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు.. వీరి కుటుంబాల మ‌ధ్య కుటుంబ ప‌ర‌మైన విభేదాలు ఉన్నాయి. అవి రాజ‌కీయంగా పెరిగి పెద్ద‌వ‌య్యాయి. ఇటీవ‌ల బ్ర‌హ్మ‌య్య దంప‌తులు బండి మీద వెళుతున్న‌ప్పుడు ప‌ద్మ కాలు తోడికోడ‌లు పాప‌మ్మకు త‌గిలింది. కావాల‌నే ప‌ద్మ అలా చేసిందంటూ పాప‌మ్మ క‌క్ష పెంచుకుంది.

మంగ‌ళ‌వారం ఉద‌యం ప‌ది మందిని తీసుకొని ప‌ద్మ ఇంటికి వ‌చ్చింది పాప‌మ్మ‌. ప‌ద్మ చేతులు.. కాళ్ల‌పై తీవ్రంగా కొడుతూ వీధిలోకి ఈడ్చుకుంటూ వ‌చ్చారు. న‌డి రోడ్డులో తీవ్రంగా కొట్టారు. ఆమె వ‌స్త్రాల్ని చింపేశారు. అడ్డుకోబోయిన భ‌ర్త‌ను కొట్ట‌టంతో పాటు.. పిల్ల‌ల్ని ఈడ్చిపారేశారు. నిస్స‌హాయుడిగా మారిన భ‌ర్త ప‌క్క‌న ప‌డి ఉండగా.. ప‌ద్మ‌ను దారుణంగా కొట్టి వెళ్లిపోయారు.

ఈ అవ‌మానాన్ని భ‌రించ‌లేని ప‌ద్మ ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుంది. ఇది గ‌మ‌నించిన భ‌ర్త త‌లుపులు విర‌గ్గొట్టి ఆమెను ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అయితే.. అప్ప‌టికే ఆమె మ‌ర‌ణించారు. ఇదిలాఉంటే.. ప‌ద్మ మ‌ర‌ణంతో టీడీపీ నేత‌లు బాధిత కుటుంబాన్ని పరామ‌ర్శించారు. జ‌రిగిన ఉదంతంపై బ్ర‌హ్మ‌య్య పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

నిజానికి ఈ ఉదంతాన్నిచూస్తే.. పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు. పూర్తిగా వ్య‌క్తిగ‌త కోపాలే కనిపిస్తాయి. కానీ.. ఈ ఉదంతం ఎండ్ రిజ‌ల్ట్ మాత్రం అధికార పార్టీకి చెందిన వారు.. ప్ర‌తిప‌క్ష పార్టీ మ‌హిళ‌ను దారుణంగా కొట్ట‌టం.. ఆ అవ‌మానం భ‌రించ‌లేక మ‌రణించ‌టంగానే రిపోర్ట్ అవుతుంది. రాజ‌కీయంగా సంబంధం లేకుండా ఉన్న ఉదంతం అధికార పార్టీ మీద మ‌చ్చ ప‌డే ప్ర‌మాదం పొంచి ఉంది.

అందుకే.. ఇలాంటి వాటి విష‌యంలో జ‌గ‌న్ అండ్ కో వెంట‌నే రియాక్ట్ కావ‌ట‌మే కాదు.. ఇలాంటి వాటికి బాధ్యులైన ప్ర‌తిఒక్క‌రిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌టం ద్వారా.. అత్యుత్సాహంతో అధికార‌పార్టీకి మ‌కిలి అంటించే వారిని క‌ట్ట‌డి చేసే అవ‌కాశం ఉంటుంది. అందుకే జ‌గ‌న్ టీం ఇలాంటి విష‌యాల్లో త‌ప్పు చేసిన వాళ్ల‌ను అస్స‌లు వ‌ద‌లొద్ద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.