Begin typing your search above and press return to search.

ఇప్పుడైనా.. జ‌గ‌న్ మాట నిల‌బెట్టుకుంటారా?

By:  Tupaki Desk   |   28 Sept 2021 6:00 AM IST
ఇప్పుడైనా.. జ‌గ‌న్ మాట నిల‌బెట్టుకుంటారా?
X
ఇప్పుడైనా.. వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాట నిల‌బెట్టుకుంటారా?- ఇదీ ఇప్పుడు వైసీపీ నేత‌ల మ‌ధ్య జోరుగా సాగుతున్న చ‌ర్చ‌. దీనికి కార‌ణం.. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ కూర్పున‌కు సంబంధించిన చ‌ర్చ‌లు ప్రారంభం కావ‌డ‌మే!. రాష్ట్రంలో 90 శాతం మంత్రి వ‌ర్గాన్ని మారుస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ ఇప్పుడు 100 శాతం మంత్రివ‌ర్గాన్ని మార్పు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ కుటుంబానికి బంధువు, ముఖ్య‌మంత్రికి స‌న్నిహితుడు అయిన‌.. మంత్రి బాలినేని స్వ‌యంగా ప్ర‌క‌టించారు. సో.. వ‌చ్చే డిసెంబ‌రు చివ‌ర‌కు లేదా.. జ‌న‌వ‌రిలో మంత్రి వ‌ర్గాన్ని మార్చేందుకు జ‌గ‌న్ రెడీ అయ్యార‌న్న మాట‌.

అయితే.. ఇప్పుడు కొత్త‌గా నియ‌మించేవారి ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. గ‌తంలో జ‌గ‌న్ హామీ ఇచ్చిన వారి ప‌రిస్థితి ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంద‌రిని పోటీ నుంచి త‌ప్పించారు. వీరికి మంత్రి ప‌ద‌వులు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా చిల‌కలూరిపేట నియోజ‌క‌వ ర్గం మాజీ ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు.. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు.. జ‌గ‌న్ బ‌హిరంగంగానే ఈ హామీ ఇచ్చారు. `మ‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే.. రాజ‌శేఖ‌ర‌న్న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాను`` అని చెప్పారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఊసు లేదు.

మ‌ధ్య‌లో ఒక‌సారి మంత్రి వ‌ర్గంలోకి ఇద్ద‌రు కొత్త‌వారిని తీసుకున్నారు. సీదిరి అప్ప‌ల‌రాజు, చెల్లుబోయిన వేణును మంత్రులుగా తీసుకున్నారు. ఆ స‌మ‌యంలో కూడా రాజ‌శేఖ‌ర్ ప్ర‌స్తావ‌న రాలేదు. పోనీ.. మంత్రి అయ్యేందుకు.. మొద‌ట ఎక్కాల్సిన గ‌డ‌ప‌.. ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఆయ‌నకు ఇవ్వ‌లేదు. మ‌రి.. ఇప్ప‌టికిప్పుడు.. ఈయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రిని చేస్తారా? లేక‌.. జ‌గ‌న్ మాట త‌ప్పుతారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇక‌, మ‌రో నాయ‌కుడు.. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి.. ఈయ‌న‌కు కూడా ఎన్నిక‌ల స‌మ‌యంలోనే మంత్రిప‌దవి హామీ ఇచ్చారు.

ఇప్ప‌టి వ‌ర‌కు దీనిని కూడా నెర‌వేర్చ‌లేదు. వీరే కాకుండా.. సీమ‌కు చెందిన జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి కూడా త‌న‌కు జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని అంటున్నారు. మ‌రి వీరికి న్యాయం చేస్తారా? లేక‌.. త‌న పంథాలో తాను నిర్ణ‌యం తీసుకుంటారా? అనేది వైసీపీలో ఆస‌క్తిగా మారింది. ఈ ద‌ఫా కూడా జ‌గ‌న్ హామీని నిల‌బెట్టుకోక పోతే.. అది ఆయ‌న నైతిక‌త‌పైనే మ‌చ్చ‌లా మారుతుంద‌ని.. అంటున్నారు నాయ‌కులు.కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చిన వారికి అవ‌కాశం ఇస్తూ.. పాత వారిని.. ముఖ్యంగా టికెట్లు త్యాగం చేసిన వారిని ప‌క్కన పెట్ట‌డం ఏమేర‌కు స‌మంజ‌సం.. అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.