Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ప్లాన్ కిక్ ఇచ్చినా... స‌క్సెస్ అయ్యేనా ?

By:  Tupaki Desk   |   29 Sept 2021 6:00 AM IST
ప‌వ‌న్ ప్లాన్ కిక్ ఇచ్చినా... స‌క్సెస్ అయ్యేనా ?
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. తాజాగా రోడ్లపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ర‌హ‌దారులు బాగా లేవంటూ..కొన్నాళ్ల కింద‌ట‌.. సోష‌ల్ మీడియా ఉద్య‌మం న‌డిపించిన ఆయ‌న‌.. ఇప్పుడు ప్ర‌త్య‌క్షంగా రంగంలోకి దిగుతున్నారు. అక్టోబ‌రు రెండున మ‌హాత్మాగాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న నిర‌స‌న బాట ప‌డుతున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఆయ‌న రూట్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా.. త‌న పార్టీ శ్రేణుల‌ను కూడా రంగంలోకి దింపుతున్నారు. ఎక్క‌డెక్క‌డ ర‌హ‌దారులు బాగోలేదో.. అక్క‌డ పార్టీ నేత‌లు.. శ్ర‌మ దానం చేయాల‌ని ఆయ‌న పిలుపు నిచ్చారు.

అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి వ‌స్తుందా. అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకం టే.. ఇది నిత్యం ట్రాఫిక్ తో ఉండే.. ప్ర‌ధాన ర‌హ‌దారుల‌ను ప‌వ‌న్ ఎంచుకోవ‌డ‌మే. జ‌న‌సేన ప్ర‌క‌టించిన కార్యాచ‌ర‌ణ మేర‌కు.. రాజ‌మండ్రి ప్ర‌ధాన ర‌హ‌దారి.. రోడ్ క‌మ్ రైల్ బ్రిడ్జి రోడ్డును, అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి-ధర్మవరం రోడ్డుకు శ్రమదానంలో భాగంగా మరమ్మతులు చేపడతారు. అయితే.. ఈ రెండు కూడా నిత్యం వేలాది మంది ప్ర‌యాణించే రోడ్లు కావ‌డం.. పైగా ప‌వ‌న్ కు ఉన్న ఇమేజ్ మేరకు అభిమానులు పోటెత్తే అవ‌కాశం ఉండ‌డంతో పోలీసులు శాంతి భ‌ద్ర‌త‌ల పేరుతో అనుమ‌తులు ఇచ్చే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.

ఇదే జ‌రిగితే.. మ‌ళ్లీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ రెచ్చిపోయే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు.. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఇప్ప‌టికే ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌డం.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం.. వంటివి సీఎం జ‌గ‌న్ స‌హా మంత్రులు కూడా సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో అక్టోబ‌రు రెండు నాటి కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తులు ఇచ్చే అవ‌కాశం లేదు. అదే జ‌రిగితే ప‌వ‌న్ ఎత్తుకు జ‌గ‌న్ స‌ర్కార్ పై ఎత్తుతో షాక్ ఇచ్చిన‌ట్టే..! ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఏం చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

ఇదిలావుంటే.. అస‌లు రోడ్ల మ‌ర‌మ్మ‌తులు అనే అంశం క‌రెక్టే అయినా.. నేరుగా రంగంలోకి దిగితే.. రాష్ట్రంలో ఎన్ని రోడ్లు బాగు చేయ‌గ‌ల‌రు? అనేది కూడా రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇది కేవ‌లం పొలిటిక‌ల్ స్టంట్ మాత్ర‌మేన‌ని.. వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ఉంది. సో.. ఇది వ‌ర్క‌వుట్ అవుతుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.