Begin typing your search above and press return to search.

రఘురామపై వేటు.. వైసీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

By:  Tupaki Desk   |   9 July 2021 9:30 AM GMT
రఘురామపై వేటు.. వైసీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?
X
ఏపీ సీఎం జగన్ ను, ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి రచ్చ చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. రఘురామ చర్యలతో వైసీపీ నేతల తలబొప్పి కడుతోంది. ఆయన ఎంపీ సీటుకు ఎసరు తేవాలని ఎంతగా ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఇప్పటివరకు ముందుకు సాగడం లేదు. తాజాగా మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి సారథ్యంలో వైసీపీ ఎంపీలంతా కలిసి లోక్ సభ స్పీకర్ ను కలిశారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను బట్టి రఘురామపై అనర్హత వేటు పడుతుందా? లేదా ? అన్నది ఉత్కంఠగా మారింది. .

ఏపీలో అధికార పార్టీకి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పక్కలో బల్లెంలో తయారయ్యారు. ఓ వైపు జగన్ బెయిల్ రద్దు చేయాలని న్యాయపోరాటం చేస్తున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో వైసీపీకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారు. ఎంపీ అయిన తననే విచారణ పేరు చెప్పి పోలీసులతో కొట్టించారంటూ అందరికీ లేఖలు రాసి వైసీపీ సర్కార్ ను అభాసుపాలు చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇది పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది ఎంపీలు రఘురామకు మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది.

ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న లోక్ సభ సమావేశాల్లో ఖచ్చితంగా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకురావాలని రఘురామ పట్టుదలతో ఉన్నారు. అదే జరిగితే జాతీయ స్థాయిలో వైసీపీకి ఘోరమైన అప్రతిష్ట తప్పదు. సొంత పార్టీ ఎంపీ ఆరోపణలు చేస్తే పార్లమెంట్ లో ఎండగడితే జగన్ సర్కార్ ప్రతిష్టకే పెద్ద దెబ్బ తప్పదు. అందుకే ఎంపీ రఘురామను ఎలాగైనా సరే సస్పెండ్ చేయించేలా చూడాలని వైసీపీ ఎంపీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పదే పదే లోక్ సభ స్పీకర్ ను కలిసి వినతులు చేస్తున్నారు.రఘురామపై వేటు వేయాలని కోరుతున్నారు.

కానీ స్పీకర్ మాత్రం ప్రతీసారి దీనిపై సానుకూలంగా స్పందించకపోవడంతో వైసీపీ ఎంపీలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. గురువారం సాయంత్రం మరోసారి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఆ పార్టీ ఎంపీలు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఇటీవలే ఓ లేఖ కూడా రాశారు. తాజాగా నేరుగా వైసీపీ ఎంపీలు విజయసాయి, మిథున్ రెడ్డి, భరత్ లు స్పీకర్ ను మరోసారి కలిశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురామరాజు పాల్పడుతున్నారని మరిన్ని ఆధారాలను స్పీకర్ కు అందజేశారు. వెంటనే రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు.

స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రఘురామపై నిప్పులు చెరిగారు. వైసీపీ టికెట్ మీద గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన రఘురామపై ఫిర్యాదు చేశామని చెప్పారు. గతంలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలను స్పీకర్ కు మరోసారి అందించామని తెలిపారు. రఘురామ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోసారి కోరామని చెప్పారు. దీనిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారని.. రఘురామపై వేటు వేస్తారంటూ మాట్లాడారు.

స్పీకర్ మాత్రం ఇప్పటికీ ఎంపీ రఘురామపై నిర్ణయం తీసుకోవడం లేదు. ఏడాది క్రితం నుంచి ఆయనపై అనర్హత వేటు పరిశీలన జరుగుతూనే ఉంది. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి రఘురామపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా స్పీకర్ నుంచి సరైన స్పందన రావడం లేదు. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నా ఆయన కరగడం లేదు. తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చూస్తే రఘురామపై వేటు ఆలస్యం అయ్యేలానే కనిపిస్తోంది.