Begin typing your search above and press return to search.

'కాళేశ్వరం కోసం భూమి ఇవ్వకపోతే చస్తాం'?

By:  Tupaki Desk   |   6 April 2022 11:30 AM GMT
కాళేశ్వరం కోసం భూమి ఇవ్వకపోతే చస్తాం?
X
సాధారణంగా భూసేకరణలో తమ భూములు కోల్పోతున్నామని తెలిస్తే రైతులు ఆందోళన చేస్తారు. కిరసనాయిలు డబ్బాలు పట్టుకొని ఆత్మహత్యా ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ తాజాగా ఓ విషయం మాత్రం వైరల్ అయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఓ రైతు భూమి ఇవ్వాల్సిందేనని.. తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయని.. ఇవ్వకుంటే చస్తామంటూ ఓ ఉన్నతాధికారి బెదిరింపుతో కూడిన రిక్వెస్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఇది నిజమా? కాదో? తెలియదు కానీ ఇప్పుడందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల మూడో టీఎంసీ కోసం కాలువ భూసేకరణ సర్వే చేస్తోందట ప్రభుత్వం. ఈ మేరకు  అధికారులు రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే దీని కోసం రైతుల భూములను తీసుకోవాలని అధికారులకు ఉన్నతాధికారులు సూచించారట.. ఈ క్రమంలోనే అధికారులను రైతులు అడ్డుకోవడం.. భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పడం కూడా జరిగిపోయిందట.. భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తే పురుగుల మందు తాగి చస్తామని ఓ రైతు కుటుంబం హెచ్చరించినట్టుగా ప్రచారం సాగుతోంది.

దీంతో రంగంలోకి దిగిన ఓ ఉన్నతాధికారి.. మీరు చావడం కాదు.. భూసేకరణ చేయకుంటే తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని.. తన కుటుంబం కూడా రోడ్డున పడుతుందని ఓ ఆర్డీవో అన్నట్టుగా జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇదంతా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో అదనపు టీఎంసీ కాలువ భూసేకరణ కోసం జరిగిన తంతు అని అక్కడ జోరుగా చర్చ సాగుతోంది. స్థానిక ఆర్డీవోకు, రైతులకు మధ్య ఇది జరిగిందని సమాచారం.

ఆర్డీవో భూసేకరణ కోసం రాగా పురుగుల మందు డబ్బాలతో రైతులు పొలాల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారట.. దీంతో తనకూ పురుగుల మందు ఇవ్వాలని.. భూసేకరణ చేయకుండా ఇక్కడే చచ్చి పోవాల్సి ఉంటుందని ఆ ఆర్డీవో అన్నట్టుగా ప్రచారం సాగుతోంది. చట్టప్రకారం భూసేకరణ జరుగుతుందని రైతులు సహకరించాలని.. దీని కోసం తనపై తీవ్ర ఒత్తిడి ఉందని అర్థం చేసుకోవాలని రైతుల వద్ద వాపోయినట్టు సమాచారం.

మరి ఇది నిజమా? ఎవరైనా పుట్టించారా? లేదో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూసేకరణ కోసం అధికారుల తిప్పలు మామూలుగా లేవని గుసగుసలాడుకుంటున్నారు.