Begin typing your search above and press return to search.

ఇక్కడి నుంచే పోటీ.. విజయశాంతి నిర్ణయం?

By:  Tupaki Desk   |   6 Nov 2018 2:33 PM IST
ఇక్కడి నుంచే పోటీ.. విజయశాంతి నిర్ణయం?
X
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఎప్పుడు ఏం చేస్తారో.. ఎవరూ పసిగట్టలేని వ్యక్తి విజయశాంతి. ఆమె ఎంత తొందరగా ఆవేశపడుతారో.. అంతే తొందరగా చొప్పున చల్లబడుతారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆమె అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మధ్య హైదరాబాద్ లో అమ్మవారికి బోనం సమర్పించి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు.

కాగా కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో చరుగ్గా వ్యవహరిస్తున్న విజయశాంతి మొదట ఈ ఎన్నికల్లో పోటీచేయకూడదని.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని యోచించారు. కానీ ఇప్పుడు తన మనసు మార్చుకున్నారు. తాజాగా ఆమె కూకట్ పల్లి నుంచి పోటీచేసేందుకు నిర్ణయించుకున్నారట.. అంతేకాదు.. తాజాగా అక్కడ ప్రచారం కూడా మొదలుపెట్టారట.. ఆమె ఇంత త్వరగా కూకట్ పల్లిని ఎంచుకోవడానికి గల కారణాలేంటో తెలియక కాంగ్రెస్ పెద్దలు తలపట్టుకుంటున్నారట..

అయితే కూకట్ పల్లి సీటు హాట్ కేకులా మారింది. ఇక ఆంధ్రా వలస జనాభా ఎక్కువ. ప్రతిసారి ఆంధ్రామూలాలున్న నేతలే గెలుస్తూ వస్తున్నారు. పైగా విజయశాంతి పక్కా తెలంగాణ వాది. అప్పుడప్పుడు ఆంధ్రావారిని తీవ్రంగా విమర్శించారు. దీంతో ఈ సీట్లో విజయశాంతి గెలుస్తుందా లేదా అన్నది పెద్ద సవాల్ తో కూడుకున్నది..

పైగా కూకట్ పల్లి నుంచి టీడీపీ సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. మహాకూటమిలో కూకట్ పల్లిని టీడీపీకి ఇచ్చేందుకు మార్గం సుగమమైందట.. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మాధవరం కృష్ణరావు ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఈసారి ఆయన గులాబీ పార్టీ తరుపునే కూకట్ పల్లి నుంచి పోటీచేస్తున్నారు.ఇక తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ కూడా కూకట్ పల్లి నుంచి పోటీచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంత గట్టి పోటీ మధ్య విజయశాంతి అసలు కాంగ్రెస్ టికెట్ దక్కించుకుంటుందా.? ఇక్కడ గెలుస్తుందా అన్నది వేచి చూడాలి.