Begin typing your search above and press return to search.

ఓటమి..ఆ పార్టీలోనూ ముసలాన్ని పుట్టించింది!

By:  Tupaki Desk   |   3 Jun 2019 4:28 PM GMT
ఓటమి..ఆ పార్టీలోనూ ముసలాన్ని పుట్టించింది!
X
మాజీ ప్రధాని - జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు హెచ్‌ డీ దేవెగౌడకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. తన సొంత పార్టీ జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌.విశ్వనాథ్‌ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈక్రమంలో దళపతులకు దిక్కు తోచని పరిస్థితి ఎదురవుతోంది. కర్ణాటకలోని కాంగ్రెస్‌ – జేడీఎస్‌ పార్టీల్లో నిత్యం అసంతృప్తవాదం కొనసాగుతున్న నేపథ్యంలో బిజీబిజీగా ఉన్న దేవెగౌడ - కుమారస్వామికి తాజాగా మరో సమస్య వచ్చి పడింది. అంతేకాకుండా పార్టీలో తగిన ప్రాధాన్యం లేదనే ఆరోపణలు పలుమార్లు చేశారు. కాగా కర్ణాటకలో ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ – జేడీఎస్‌ మధ్య అంతర్‌ యుద్ధం జరిగింది. తాజాగా జేడీఎస్‌ నేతల మధ్యనే మాటల యుద్ధం ఆరంభమైంది.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌.విశ్వనాథ్ - జేడీఎస్‌ కు చెందిన మంత్రి సా.రా.మహేశ్‌ వివాదం తలెత్తింది. టికెట్‌ ల కేటాయింపు విషయంలో సా.రా.మహేశ్‌ పైచేయి సాధించారు. కానీ ఫలితాలు భిన్నంగా రావడంతో హెచ్‌.విశ్వనాథ్‌ వాక్‌ సమరానికి తెరతీశారు. దీనిపై ఇద్దరు ఒకరినొకరు ట్వీట్‌ లు చేసుకున్నారు. ఈ క్రమంలో తాను పార్టీ అధ్యక్షుడు అనే గౌరవం లేకుండా మంత్రి ఘాటుగా స్పందించడం సరికాదని విశ్వనాథ్‌ బహిరంగంగా వాపోయారు. అంతేకాకుండా అధ్యక్ష పదవికి త్వరలోనే రాజీనామా చేస్తానని అనుచరుల వద్ద చెప్పినట్లు సమాచారం. జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తన వాదనలు ఏవీ ఆ పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు చేస్తూ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు హెచ్‌.విశ్వనాథ్‌ తెలిపారు. జేడీఎస్‌ లో తనకు తగిన ప్రాధాన్యం లేదని.. ఈ క్రమంలో గతంలోనే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. అయితే జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు - మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సూచన మేరకు ఇన్నాళ్లూ కొనసాగినట్లు ఆయన చెప్పారు.

మైసూరు జిల్లా కేఆర్‌ నగర పురసభకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. కేఆర్‌ నగర పురసభ పరిధిలోని 23 వార్డులకు తన మద్దతుదారులను జేడీఎస్‌ తరఫున బరిలో దింపాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌.విశ్వనాథ్‌ భావించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే - మంత్రిగా ఉన్న సా.రా.మహేశ్‌ తిరస్కరించారు. ఆయనకు నచ్చిన వారికే టికెట్‌ లు ఇచ్చారు. దీనికి తోడు ఫలితాల్లో జేడీఎస్‌ వెనుకబడటంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో అధ్యక్షుడిగా తనకు తగిన గుర్తింపు లేదని.. మనస్తాపానికి గురైనట్లు హెచ్‌.విశ్వనాథ్‌ మీడియా ముందు వాపోయారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మంత్రి సా.రా.మహేశ్‌ పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అనుభవం ఉందని.. అన్నీ తానై వ్యవహరిస్తే తాను మంత్రిగా ఎందుకని సా.రా.మహేశ్‌ స్పందించారు. అయితే సుమారు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ లో కొనసాగి అనంతరం పార్టీ మారి జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన హెచ్‌.విశ్వనాథ్‌ గత ఏడాది కాలం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. సిద్ధరామయ్యతో విభేదాల కారణంగా తాను కాంగ్రెస్‌ వీడి జేడీఎస్‌ లో చేరినట్లు తెలిపారు. ఈక్రమంలో ఇక్కడ కూడా సరయిన న్యాయం జరగలేదని ఆయన అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం.