Begin typing your search above and press return to search.

రోడ్ మ్యాప్ పై చర్చిస్తారా?

By:  Tupaki Desk   |   2 Jun 2022 3:29 AM GMT
రోడ్ మ్యాప్ పై చర్చిస్తారా?
X
ఈనెల 4వ తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్ధాయి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో అధినేత పవన్ కల్యాణ్ తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పాలిట్ బ్యూరో సభ్యులు, పీఏసీ కమిటి సభ్యులు, రాష్ట్రకమిటి సభ్యులతో పాటు జిల్లాల అధ్యక్షులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో పార్టీ పరిస్ధితి, పొత్తులు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులే ప్రధాన అజెండాగా ఉండబోతోందని సమాచారం.

షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల వేడిమాత్రం బాగా పెరిగిపోయింది. రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు. తన కార్యక్రమాల ద్వారా జగన్ డైరెక్టుగా జనాలతో టచ్ లో ఉంటున్నారు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు కూడా బాదుడేబాదుడు అనే కార్యక్రమంతో జనాల్లో తిరిగారు. ఈమధ్యనే మహానాడు నిర్వహించారు.

అంటే ఇటు జగన్ అటు చంద్రబాబు ఏదో కారణాలతో జనాల్లో తిరుగుతుంటే పవన్ మాత్రం హ్యాపీగా షూటింగులు చేసుకుంటున్నారు. గ్యాప్ లో ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతులకు పరిహారం పేరుతో మూడు జిల్లాల్లో తిరిగారంతే.

మళ్ళీ సినిమాషూటింగుల్లో బిజీ అయిపోయారు. రాజకీయవేడి కారణంగా జనాల్లోనే తిరగాల్సిన పవన్ ఎంచక్కా సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటంపై పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు ఒకపుడు బాగా ఉత్సాహం చూపించిన చంద్రబాబు ఇపుడా ఊసే ఎత్తటంలేదు.

ఇలాంటి అనేక అంశాలపై క్లారిటి లేకుండా జనసేన నేతలు అయోమయంలో ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తుండదనే బలమైన ప్రచారం జరుగుతోంది. రోడ్డుమ్యాప్ కోసం పవన్ ఇంకా వెయిట్ చేస్తున్నారు.

అసలా రోడ్ మ్యాప్ మిత్రపక్షం అగ్రనేతలు ఇస్తారా అనేది కూడా డౌటుగా మారింది. ఈనెల 7వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజమండ్రికి వస్తున్నారు. మరి తన పర్యటనలో పవన్ తో భేటీ ఉంటుందా లేదా అన్నది తేలలేదు. అందుకనే 4వ తేదీన సమావేశంలో రోడ్ మ్యాప్ పై క్లారిటి విషయం తేలిపోతుందని అనుకుంటున్నారు.