Begin typing your search above and press return to search.

మోదీతో జ‌గ‌న్ భేటీ... ఇవే కీల‌కం కానున్నాయా...

By:  Tupaki Desk   |   5 Aug 2019 1:14 PM IST
మోదీతో జ‌గ‌న్ భేటీ... ఇవే కీల‌కం కానున్నాయా...
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఇజ్రాయెల్ ప‌ర్య‌ట‌న ముగించుకుని సోమ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చారు. ఇక బుధ‌వారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి భేటీ ఉండ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఏయే అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తాయి ? జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, నిధులు రాబ‌ట్టే విష‌యంలో స‌క్సెస్ అవుతారా ? అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

మంగళవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న సీఎం అదేరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. బుధవారం రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్‌ సమావేశం అవుతారు. జ‌గ‌న్ త‌న తాజా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్రపతితో సహా కేంద్ర ప్రభుత్వంలోని ప్రముఖులను కలవబోతూ ఉన్నారని తెలుస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలోని ప‌లు అంశాలు అప‌రిష్కృతంగానే ఉన్నాయి.

విభ‌జ‌న జ‌రిగి ఐదేళ్లు దాటుతున్నా ఇంకా కొన్ని అంశాలు కేంద్రం వ‌ద్ద పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇవి ఎప్ప‌ట‌కి ప‌రిష్కృతం అవుతాయో ? తెలియ‌ని ప‌రిస్ధితి. ఇక వెన‌క‌ప‌డిన ఏడు జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే ప్ర‌త్యేక నిధులు అతీగ‌తీలేవు. వీటితో పాటు స్టీల్ ప్లాంటు, ఓడరేవు అంశాలను ప్రధాని, కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక జ‌గ‌న్ ఇటీవ‌ల నీటిపారుద‌ల రంగంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుల‌కు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్ర‌మంలోనే గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తరలించడం వెనుక ఉన్న లక్ష్యాలు వివ‌రించ‌డంతో పాటు వీటికి సంబంధించిన అనుమ‌తుల‌పైనా చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ అంశంపై కేంద్రం నుంచే అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతుండ‌డంతో ఈ విష‌యాన్ని కూడా మోదీ దృష్టికి తీసుకువెళ్లి ప్ర‌జాధ‌నం ఆదా అయ్యే విష‌యం సైతం ప్ర‌స్తావిస్తార‌ని అంటున్నారు. ఇక ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు రాష్ట్రం నుంచి కేంద్రానికి నివేదించాల్సిన అంశాల‌తో పాటు అక్క‌డ మోదీతో పాటు ఇత‌ర కేంద్ర‌మంత్రుల వ‌ద్ద ప్ర‌స్తావించాల్సిన విష‌యాల‌పై నివేదిక రూపొందించారు.