Begin typing your search above and press return to search.

రోడ్లను మూసివేస్తారా? కేటీఆర్ సీరియస్

By:  Tupaki Desk   |   16 July 2021 9:49 AM IST
రోడ్లను మూసివేస్తారా? కేటీఆర్ సీరియస్
X
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహించారు. నగర వాసులు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాత్ సింగ్ ను కోరారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రికి గురువారం మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

ఈ రోడ్ల మూసివేత అంశాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. తాజాగా లోకల్ మిలటరీ అథారిటీ తన పరిధిలో ఉన్న అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్, వెల్లింగ్టన్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్ వంటి కీలకమైన నాలుగు రోడ్లను కోవిడ్ కేసుల పేరు చెప్పి మూసివేసిందని.. ఈ చర్య కారణంగా లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి కేటీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు.

మిలటరీ అధికారులు పదేపదే ఇలా రోడ్లను మూసివేయడంతో నగర ప్రజలు అనేక కిలోమీటర్లు అదనంగా తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నారని కేంద్రమంత్రికి కేటీఆర్ వివరించారు.

తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గాయని.. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగినా కరోనా పేరు చెప్పి మిలట్రీ అధికారులు రోడ్లు మూసివేయడం అత్యంత బాధాకరమని కేటీఆర్ తెలిపారు.

లోకల్ మిలటరీ స్తానిక కంటోన్మెంట్ బోర్డుకు సంబంధం లేకుండా రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని మంత్రి ఆరోపించారు. కంటోన్మెంట్ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 258కి ఇది పూర్తి విరుద్ధమని మంత్రి కేటీఆర్ తన లేఖలో రాజ్ నాథ్ సింగ్ కు గుర్తు చేశారు. కంటోన్మెంట్ బోర్డు చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకు మాత్రమే ఈ రోడ్లు మూసివేసే ప్రక్రియ ఉండాలని సూచించారు. కానీ మిలటరీ అధికారులు మాత్రం ఇష్టారీతిన అత్యంత చిన్న కారణాలు చూపి రోడ్లు మూసివేస్తున్నారని అన్నారు.

గతంలో ఈ అంశాన్ని రక్షణ శాఖ దృష్టికి తీసుకురావడంతో కంటోన్మెంట్ బోర్డుకు సంబంధం లేకుండా రోడ్ల మూసివేతకు పాల్పడరాదని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని.. అయినప్పటికీ స్థానిక మిలటరీ అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని రాజ్ నాథ్ సింగ్ కు మంత్రి కేటీఆర్ వివరించారు. రక్షణ శాఖ అధికారులే మార్గదర్శకాలను, సూచనలను పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.

మిలటరీ అధికారుల పరిధిలో ఉన్న రోడ్లపైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కార్యదర్శితో ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని.. దీనికి రక్షణ శాఖ నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని కేటీఆర్ తెలిపారు.మిలటరీ అధికారులు పదే పదే రక్షణశాఖ ఆదేశాలను తుంగలో తొక్కడం బాగోలేదన్నారు.

రోడ్లు మూసివేయకుండా ఆదేశాలిచ్చి లక్షలాది హైదరాబాబాద్ పౌరులకు ఊరట కల్పించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు మంత్రి కేటీఆర్ కోరారు.