Begin typing your search above and press return to search.

రాత్రి 9 గంటలకు మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు మొదలు?

By:  Tupaki Desk   |   17 March 2021 3:52 AM GMT
రాత్రి 9 గంటలకు మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు మొదలు?
X
రెండు పట్టభద్రుల ఎమ్మల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ఓట్ల లెక్కింపు ఈ రోజు (బుధవారం) మొదలు కానుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఆసక్తికర అంశాలు చోటు చేసుకోనున్నాయి. గతంతో పోలిస్తే.. ఈవీఎంల ఎంట్రీతో.. ఓట్ల లెక్కింపు కార్యక్రమం చాలా తేలికైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైతే.. పది గంటలకు ట్రెండ్స్ ఎలా ఉన్నాయన్న విషయం తేలిపోవటం.. పదకొండు గంటల సమయానికి తుది ఫలితం ఏ రీతిలో ఉందన్న విషయంపై పూూర్తి స్పష్టత వచ్చేస్తున్న పరిస్థితి. అందుకు భిన్నంగా.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండనుందని చెప్పాలి.

సాధారణ ఎన్నికలకు.. పట్టభద్రుల స్థానానికి జరిగే ఓట్ల లెక్కింపు వ్యవహారం భిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందునా.. హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి 93 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో.. ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తి అయ్యేసరికి కనీసం రెండు నుంచి మూడు రోజులుపడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలు ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ మొదలయ్యేసరికే బుధవారం రాత్రి 8-9 గంటల మధ్యలో మొదలు కానున్నట్లు చెబుతున్నారు.

మూడు జిల్లాల (హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్) పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ఎనిమిది గంటలకు షురూ కానుంది. మొత్తం ఓట్లను ఒకచోటుకు చేర్చటం.. అనంతరం బ్యాలెట్ పేపర్లను బండిల్స్ గా చుట్టటం.. వాటిని రౌండ్ల వారీగా లెక్కింపునకు సిద్ధం చేయటం.. అనంతరం మొదటి రౌండ్ ఓట్లను లెక్కించనున్నారు. ఇదంతా జరగటానికి తక్కువలో తక్కువ ఈ రాత్రి (బుధవారం) వరకు టైం తీసుకుంటుందని చెబుతున్నారు. ఈ అర్థరాత్రి 12 గంటల సమయానికి రెండు లేదంటే మూడో రౌండ్ ఫలితం తెలిసే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇదంతా కూడా అంచనానే తప్పించి.. కచ్ఛితమని చెప్పకపోవటం గమనార్హం. కారణం.. ఓట్ల లెక్కింపులో ఉన్న సంక్లిష్టత మాత్రమేనని చెప్పక తప్పదు.