Begin typing your search above and press return to search.

దిశ నిందితుల డెడ్ బాడీలు ఢిల్లీకి తీసుకెళతారా?

By:  Tupaki Desk   |   17 Dec 2019 7:44 AM GMT
దిశ నిందితుల డెడ్ బాడీలు ఢిల్లీకి తీసుకెళతారా?
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఉదంతం పోలీసులకే కాదు.. వైద్యులకు తలనొప్పిగా మారినట్లు చెబుతున్నారు. దారుణమైన నేరానికి పాల్పడిన వారు.. ఎన్ కౌంటర్ లో మరణించటం తెలిసిందే. దీనిపై వివాదం తలెత్తటంతో ఇప్పుడా అంశం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. కోర్టులు.. న్యాయసవాళ్లను ఎదుర్కోవటానికి సైబరాబాద్ పోలీసులు కిందామీదా పడుతున్నారు. ఇదిలా ఉంటే.. దిశ నిందితుల డెడ్ బాడీస్ ను ఖననం చేయొద్దని.. వాటిని భద్రపర్చాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.

దీంతో షాద్ నగర్ లో ఉంచిన నిందితుల మృతదేహాల్ని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. షాద్ నగర్ లో పోలిస్తే.. మరింత మెరుగైన ఫ్రీజర్ బాక్సులు ఉన్నాయి. అయితే.. ఇక్కడ రెండు వారాలకు మించి ఉంచలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. నాలుగు మృతదేహాలకు ఎంబామింగ్ చేసినా రెండు వారాలకు మించి భద్రపర్చలేమన్నది వైద్యుల వాదన. అంతేకాదు.. ఎంబామింగ్ చేస్తే రీపోస్టుమార్టమ్ కు అవకాశం ఉండదన్న వాదన వినిపిస్తోంది.

ఎంత శీతలీకరణలో ఉంచినా.. డెడ్ బాడీస్ చెడిపోకుండా ఉండేలా ఉష్ణోగ్రతల్ని మొయింటైన్ చేయటం సాధ్యం కాదంటున్నారు. కోర్టు నుంచి ఈ నెల 13 నాటికి ఏదో ఆదేశం వస్తుందని భావించినా.. అలాంటిదేమీ రాకపోవటంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో గాంధీ వైద్యులు ఉన్నారు.

డెడ్ బాడీస్ చెడిపోతున్నాయని.. అలానే ఉంచేస్తే.. కుళ్లిపోతాయని.. అది తమ నిర్లక్ష్యంగా కోర్టు భావించే ప్రమాదం ఉందన్న ఆందోళనను వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాలను ఢిల్లీకి పంపితే మంచిదన్న ఆలోచనలో వైద్యులు ఉన్నారు. ఎందుకంటే.. హైదరాబాద్ తో పోలిస్తే.. ఢిల్లీలో అత్యాధునిక ఫ్రీజర్లు ఉండటమే కారణంగా భావిస్తున్నారు. మరి.. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.