Begin typing your search above and press return to search.

కెప్టెన్ సక్సెస్ అవుతారా ?

By:  Tupaki Desk   |   2 Oct 2021 5:32 AM GMT
కెప్టెన్ సక్సెస్ అవుతారా ?
X
తనను అవమానించిన కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో ఓడించటమే టార్గెట్ గా కెప్టెన్ అమరీందర్ సింగ్ కంకణం కట్టుకున్నట్లే ఉంది. పంజాబ్ సీఎంగా అమరీందర్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు చాలా స్పీడుగా మారిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. కాంగ్రెస్ లో మారిపోతున్న పరిణామాలు ఇతర పార్టీలపైన కూడా అనివార్యంగా పడుతున్నాయి. వచ్చే ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చేస్తుందనే ఒకపుడు బాగా ప్రచారం జరిగింది. అలాంటి స్ధితినుండి ఓటమి ఖాయమనేట్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి దిగజారిపోయింది.

ఇదంతా కూడా అమరీందర్ కేంద్రంగా జరిగిన రాజకీయ పరిణామాల పుణ్యమనే చెప్పాలి. ఇలాంటి నేపధ్యంలోనే ఢిల్లీలో కెప్టెన్ క్యాంపు వేసినపుడు బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రితో గంటపాటు అమరీందర్ భేటీ అవటంతో అందరు బీజేపీలో మాజీ సీఎం చేరిక లాంఛనమే అనుకన్నారు. అయితే అనూహ్యంగా తాను బీజేపీలో కూడా చేరేదిలేదని కెప్టెన్ స్పష్టంగా ప్రకటించారు. దాంతోపాటు కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశారు.

కెప్టెన్ పెట్టబోయే కొత్తపార్టీ కారణంగా కాంగ్రెస్ లో భారీ చీలిక రావటం తథ్యమని తేలిపోతోంది. కెప్టెన్ పార్టీ పెట్టగానే కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు కాంగ్రెస్ ను వదిలేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినటం ఖాయమని విశ్లేషణలు పెరిగిపోతున్నాయి. తాను అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు కాంగ్రెస్ ను ప్రత్యేకించి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూని ఓడించటమే లక్ష్యంగా కెప్టెన్ పావులు కదుపుతున్నారు.

కెప్టెన్ తాజా వ్యూహాల ప్రకారం కాంగ్రెస్ లోని తన మద్దతుదారులతోనే రెగ్యులర్ గా భేటీలు జరుపుతున్నారు. అంటే తాను ఏర్పాటు చేయబోయే కొత్తపార్టీలోకి కాంగ్రెస్ నుండి వచ్చే వాళ్ళెవరనే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసిపోతోంది. అలాగే జనాల మద్దతు సంపాదించటంలో భాగంగా రైతుసంఘాల నేతలతో సమావేశమవుతున్నారు. నరేంద్రమోడి సర్కార్ తెచ్చిన వ్యవసాయ చట్టాలను రైతులు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో తెలిసిందే.

పంజాబ్ అంటేనే వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని అందరికీ తెలిసిందే. రైతుల మద్దతులేనిదే ఏ పార్టీ కూడా ఎన్నికల్లో గెలవలేందు. బీజేపీపై ప్రస్తుతం రాష్ట్ర రైంతాంగంలో ఉన్న వ్యతిరేకతను అడ్వాంటేజ్ తీసుకునేందుకు కెప్టెన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే రైతు సంఘాల నేతలతో భేటీ అవుతున్నారు. సీఎంగా ఉన్నపుడు ఉద్యమాలు చేసిన రైతుసంఘాలకు తాను ఇచ్చిన మద్దతును కెప్టెన్ గుర్తుచేస్తున్నారట. కాబట్టి అధికారంలోకి రావటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అదికాకపోతే కనీసం కాంగ్రెస్ ఓడించాలని గట్టిగా కంకణం కట్టుకునే వ్యూహాలు పన్నుతున్నారు. మరి ఎందులో కెప్టెన్ సక్సెస్ అవుతారో చూడాల్సిందే.