Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను దించేస్తారా?

By:  Tupaki Desk   |   26 Nov 2019 1:30 AM GMT
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను దించేస్తారా?
X
గద్దెనెక్కిన రోజు నుంచి తన తీరుతో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అభిశంసన ప్రక్రియ అత్యంత ఆసక్తిదాయకంగా మారుతూ ఉంది. ట్రంప్ ను అధ్యక్ష పీఠం నుంచి దించేయాలనే డిమాండ్ మొదటి నుంచి ఉంది. ఆయన తీరు సరిగా లేదని అమెరికా లోని ఆయన వైరి పక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి.

వలస వాదులతో కానీ, ఇస్లామిక్ కంట్రీస్ తో కానీ.. ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు పై విమర్శలు ఉండనే ఉన్నాయి. అయితే ట్రంప్ తన అధికారాలను పూర్తిగా వాడుకుంటూ..అమెరికా ఫస్ట్ అంటూ జాతీయ వాద భావనలను రేకెత్తిస్తూ, తన విచ్చిన్నకర వాదాలను అమల్లో పెడుతూ ఉన్నారనే అభిప్రాయాలున్నాయి.

అసలు ట్రంప్ నెగ్గరని కూడా అనేక మంది అనుకున్నారు. అయితే అమెరికా ఫస్ట్ అంటూ తెల్లజాతి జనాల ఓట్ల ను బాగా పొందగలిగారు ఈయన. ఇక ట్రంప్ వల్ల ఇండియా కూడా బాగా ఇబ్బందులు పడుతూ ఉంది.

ఇతడు గద్దెనెక్కాకా అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ ఉండిన భారతీయ విద్యార్థులకు కూడా ట్రంప్ చుక్కలు చూపించాడు. ఇక వాణిజ్య ఒప్పందాల విషయంలో కూడా ట్రంప్ తీరుకూ, ఇండియాకు పెద్దగా పొసగడం లేదు. అమెరికా నుంచి ఇండియా దిగుమతి చేసుకునే వస్తువుల పై పన్నులను తగ్గించాలంటూ ట్రంప్ బహిరంగం గా వ్యాఖ్యానించాడు.

వివిధ దేశాలతో ట్రంప్ చేస్తున్న ట్రేడ్ వార్.. ఇండియా మీద సాగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ అభిశంసన భారతీయులను ఆనంద పెట్టవచ్చు. ట్రంప్ విషయం లో… అన్నింటికి మించి వచ్చే ఎన్నికల నాటికి తనకు ప్రత్యర్థి అవుతారనే వారిపై అవినీతి ముద్రలు వేయడానికి ట్రంప్ ఉక్రెయిన్ సహకారం తీసుకుంటున్నారనే అభియోగాలే ఆయన అభిశంసన కు తక్షణ కారణాలు అవుతూ ఉన్నాయి. మరి అదే జరిగితే.. అభిశంసనే జరిగితే.. ఆ తరహా లో పదవి నుంచి తొలగించబడ్డ నేతగా ట్రంప్ నిలిచే అవకాశం ఉంది.