Begin typing your search above and press return to search.

కుప్పం ప‌ర్య‌ట‌నతో టీడీపీ పుంజుకునేనా?

By:  Tupaki Desk   |   31 Oct 2021 3:30 AM GMT
కుప్పం ప‌ర్య‌ట‌నతో టీడీపీ పుంజుకునేనా?
X
టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రెండు రోజుల పాటు కుప్పంలో ప‌ర్య‌టించారు. తొలిరోజు ఏపీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.. వైసీపీని క‌డిగిపారేశారు. ద‌మ్ముంటే.. చ‌ర్చ‌ల‌కు రావాల‌ని పిలుపునిచ్చారు. బూతులు ఎవ‌రు మాట్లాడుతున్నారో తేల్చేద్దామ‌న్నారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న‌పై ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని అన్నారు. ఇలా, రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లోనూ చంద్ర‌బాబు దూకుడుగా ముందుకు సాగారు. చంద్రబాబు రాక కుప్పం టీడీపీ శ్రేణుల్లో అమితోత్సాహం నింపింది. ఇక‌, రెండో రోజు.. రైతుల‌తోనూ.. స్థానిక ప్ర‌జ‌ల‌తోనూ మ‌మేక‌మ‌య్యారు.రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

చంద్రబాబు త‌న శ్రేణుల‌తో క‌లిసి ఇక్క‌డ‌ రోడ్‌షో నిర్వహించారు. పొలాల్లో రైతుల దగ్గరకెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. మద్దతు ధరలేక వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతుకు మద్దతు ధర కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆయన రోడ్‌షో, బహిరంగ సభకు భారీఎత్తున తరలివచ్చారు. పలువురు కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. అయితే.. మొత్తంగా కుప్పం ప‌ర్య‌ట‌న ద్వారా.. చంద్ర‌బాబు ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఎందుకు ఆయ‌న అనూహ్యంగా కుప్ప ప‌ర్య‌ట‌న‌కు త‌ర‌లి వ‌చ్చారు? అనే చ‌ర్చ టీడీపీలోనే సాగుతుండ‌డంగ‌మ‌నార్హం.

త్వ‌ర‌లోనే కుప్పం స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించి వైసీపీ అధినేత‌.. స‌హా పార్టీ సీనియ‌ర్లు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. కుప్పం మునిసిపాలిటీని ద‌క్కించుకోవ‌డం ద్వారా.. చంద్ర‌బాబుకు చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కుప్పంలో వైసీపీ పాగా వేసింది. ఈ నేప‌థ్యంలో కుప్పంలో పార్టీని కాపాడుకునేందుకు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చార‌నే చ‌ర్చ సాగుతోంది. అదేస‌మ‌యంలో చెట్టుకొక‌రుగా ఉన్న‌ నేత‌ల‌ను ఒకే తాటిపై న‌డిపించేందుకు.. చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని.. కుప్పం ప‌ర్య‌ట‌న‌కు అందుకే వ‌చ్చి ఉంటారని అంటున్నారు.

అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుపై వైసీపీ మంత్రులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు.. కుప్పం ప‌ర్య‌ట‌న‌ను ఆయ‌న వినియోగించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే వాద‌న కూడా తెర‌మీదికి వ‌చ్చింది. అదేస‌మ‌యంలో ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి అమిత్ షా అప్పాయింట్‌మెంట్ స‌మ‌యం ఇవ్వ‌క‌పోవ‌డం.. దీనిపై వ‌చ్చిన విమ‌ర్శ‌లు.. ఇప్ప‌టికీ జ‌రుగుతున్న చ‌ర్చ .. వంటివాటిని ప‌క్క‌న పెట్టేందుకు కూడా ఈ ప‌ర్య‌ట‌న‌ను ఆయ‌న వినియోగించుకుని ఉంటార‌ని.. పార్టీ నేత‌లు అంటున్నారు. ఏదేమైనా.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న స‌ర్వ‌త్రా.. ఆస‌క్తి రేపింది. మ‌రి ఈ ప‌ర్య‌ట‌న త‌ర్వాత‌.. కుప్పంలో టీడీపీ పుంజుకుంటుందా? మునిసిపాలిటీని ద‌క్కించుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది.