Begin typing your search above and press return to search.

భారత్ లో ఐఫోన్ తయారీ.. టాటా చేయనుందా?

By:  Tupaki Desk   |   9 Sep 2022 11:30 PM GMT
భారత్ లో ఐఫోన్ తయారీ.. టాటా చేయనుందా?
X
ప్రపంచంలో మరే స్మార్ట్ ఫోన్ కు లేని క్రేజ్ ఐఫోన్ సొంతం. ఆ సంస్థ ఎప్పుడైనా కొత్త సిరీస్ ఫోన్ ను విడుదల చేసిన వెంటనే.. మరో ఆలోచన లేకుండా కొత్త ఫోన్ ను కొనుగోలు చేసేవారు లక్షల్లో ఉంటారు. అంతేకాదు.. యాపిల్ సంస్థ కొత్త ఫోన్ ఎప్పుడెప్పుడో విడుదల చేస్తుందన్న దాని కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేసే వారికి కొదవ లేదు.

తాజాగా ఐఫోన్ 14ను విడుదల చేయటం తెలిసిందే. దీని ధరల విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ఐఫోన్ ను భారత్ లోనే తయారీ చేసేందుకు ఆ సంస్థ ప్రణాళికల్ని సిద్ధం చేయటం తెలిసిందే.

భారత్ లో ఐఫోన్ తయారీ చేయటం వల్ల మార్కెట్ ను మరింతగా సొంతం చేసుకునే వీలుంది. భారత్ లో ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు తైవాన్ కు చెందిన విస్ట్రన్ కొర్పారేషన్ తో యాపిల్ సంస్థ చర్చలు జరుపుతున్నట్లుగా ప్రఖ్యాత మీడియా సంస్థ బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. తాజాగా తన సంచలన కథనంలో దీనికి సంబంధించిన ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది.

ఐఫోన్ ను భారత్ లో తయారు చేసేందుకు తైవాన్ సంస్థ.. ప్రఖ్యాత టాటా గ్రూప్ తో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. వ్యాపారం ఏదైనా సరే.. విలువతో చేయటంతో పాటు పక్కా సప్లై చెయిన్ ఉన్న టాటా సంస్థతో చేయటం ద్వారా ఐఫోన్ విలువ మరింత పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది. యాపిల్ కు చెందిన ఐఫోన్లను తైవాన్ కు చెందిపన విస్ట్రన్ కార్పొరేషన్ తో పాటు ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూప్ చేస్తుంటాయి. ఇవి భారత్.. చైనాలలో ఐఫోన్లను అసెంబుల్ చేస్తాయి. ప్రస్తుతం ఎక్కువ శాతం కంపెనీలు ఫోన్ల తయారీ విషయంలో చైనా మీదనే ఆధారపడుతున్నాయి.

కొవిడ్.. లాక్ డౌన్లు.. అమెరికాతో ఘర్షణలు లాంటి అంశాలతో చైనా మీద ఆధారపడే అంశాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి. యాపిల్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. చైనాలో ఇప్పుడున్న ఉత్పత్తి కేంద్రాన్ని కొనసాగిస్తూ.. కొత్తగా ఇతర దేశాల్లో చేపట్టాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా భారత్ లోనూ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.

దీనికి సంబంధించి ప్రస్తుతం రెండు గ్రూపుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. విస్ట్రన్ ఇండియాలో టాటా గ్రూప్ ఈక్విటీలు కొనుగోలు చేసే వీలుందని.. లేదంటే రెండు కంపెనీలు ఒక అసెంబ్లింగ్ ప్లంట్ ను ఏర్పాటు చేయొచ్చంటున్నారు. అది కూడా కాదంటే.. రెండు అవకాశాల్న్ి పరిశీలించేలా చేయొచ్చన్న మాట కూడా వినిపిస్తోంది. బ్లూమ్ బెర్గ్ పబ్లిష్ చేసిన ఈ కథనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.