Begin typing your search above and press return to search.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా?

By:  Tupaki Desk   |   23 April 2022 6:30 PM GMT
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా?
X
ప్రేమను ప్రేమతోనే గెలవాలి యుద్ధంతో కాదు. ద్వేషం ద్వేషాన్నే పెంచుతుంది కానీ శాంతిని కాదని మన గౌతమ బుద్ధుడు ఏనాడో చెప్పారు. కానీ ప్రపంచమే వింత పోకడలతో విధ్వంసానికి పాల్పడుతోంది. మానవాళి మనుగడకే మచ్చ తెస్తోంది. యుద్ధ కాంక్ష మంచిది కాదని చెప్పినా వినిపించుకోవడం లేదు. ఫలితంగా రెండు దేశాల మధ్య పగలే తప్ప ప్రేమలు ఎక్కడ ఉంటయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచమే నివ్వెరపోతోంది. రెండు దేశాల మధ్య రోజురోజుకు విద్వేషాలు పెరుగుతున్నాయి.

దీనిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం విరమించాలని ప్రతిపాదనలు చేస్తున్నాయి. అయినా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఒప్పుకుంటున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ససేమిరా అంటున్నాడు. తగ్గేదేలే అని చెబుతున్నారు. గత ఫిబ్రవరి 24 నుంచి రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా బాంబులు, క్షిపణుల దాడితో కీవ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నారు. దీంతో రెండు దేశాలు శాంతి చర్చలు కొనసాగిస్తున్నా అవి ఫలప్రదం కావడం లేదు. ఫలితంగా యుద్ధం కూడా ఆగడం లేదు.

ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనీ గుటెరస్ తనవంతు ప్రయత్నాలు చేయడానికి సంకల్పించారు. ఈ మేరకు ఏప్రిల్ 26న రష్యా అధ్యక్షుడు పుతిన్ తో 28న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ అయ్యేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారికి సమాచారం కూడా పంపారు. కానీ వీరి సమావేశం ఎంతమేరకు విజయవంతం అవుతుందో తెలియడం లేదు. కానీ మొత్తానికి యుద్ధాన్ని నివారించాలని గుటెరస్ చేస్తున్న కృషి మాత్రం ప్రశంసనీయమే. రెండు దేశాల మధ్య సఖ్యత కోసం ఆయన భావించడం ముదావహమే.

రష్యా, ఉక్రెయిన్ విషయంలో మధ్యవర్తిత్వం వహించే బాధ్యతను ఆయన భుజాలకెత్తుకున్నారు. దీంతో రాబోయే కాలంలో రెండు దేశాల మధ్య శాంతి చర్చలు సఫలం అయి ప్రపంచ మానవాళికి తీపి కబురు అందుతుందేమోననే ఆశలు అందరిలో వస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ లలో శాంతి సామరస్యం వెల్లివిరిసి ప్రజలు మంచి ఆశలతో జీవించాలనే అందరు ఆశిస్తున్నారు. కానీ రష్యా మాత్రమే యుద్ధ తంత్రాన్ని నమ్ముతూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటూ బేషజాలకు పోతోంది.

మొదట యుద్ధంలో ప్రజలపై దాడులు చేయమని చెప్పిన రష్యా తరువాత మాట మార్చింది. జనవాసాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. ఫలితంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎటు చూసినా భీతావహ వాతావరణమే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా సేనల ధాటికి ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నెత్తుటి ధారలు చూస్తుంటే అందరిలో కన్నీళ్లే వస్తున్నాయి. అన్యాయంగా అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం పుతిన్ కే చెల్లుతుందని అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

భవిష్యత్ లో ఇలాంటి పరిణామాలు రాకుండా ఉంటేనే మంచిది. మూడో ప్రపంచ యుద్ధం వద్దని మనుషులంతా మొత్తుకుంటుంటే పుతిన్ మాత్రం ఆ దాహాన్ని తీర్చుకుంటున్నాడు. ప్రపంచ మానవాళిపై పెను ప్రమాదాన్ని ఉంచుతున్నారు. ఫలితంగా లక్షలాది మంది ఉసురు తీస్తూ తనలోని పశుతత్వాన్ని ప్రదర్శించడం దారుణమే.