Begin typing your search above and press return to search.

రేవంత్ వ్యూహాలు ఫ‌లించ‌డం క‌ష్ట‌మేనా?

By:  Tupaki Desk   |   7 Aug 2021 3:30 PM GMT
రేవంత్ వ్యూహాలు ఫ‌లించ‌డం క‌ష్ట‌మేనా?
X
కాంగ్రెస్ అంటేనే అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం పేరిట కుమ్ములాట‌ల‌కు పెట్టింది పేరు. పార్టీ నాయ‌కులు మారినా.. పోరు మాత్రం ఆగ‌డం లేదు. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకొనే కాంగ్రెస్‌కు.. తెలంగాణ‌లో పార్టీని ముందుకు న‌డిపించ‌డంలో ఇలాం టి ఆధ‌పత్య ధోర‌ణులే ప్ర‌ధాన సంక‌టంగా ప‌రిణ‌మిస్తున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ ఆధిప‌త్య పోరుతో నాయ‌కులు త‌మ పంతం నెగ్గించు కునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారే త‌ప్ప‌.. పార్టీని ముందుండి న‌డిపించేందుకు త్యాగాలు చేయ‌డంలోను.. త‌మ పంతాల‌ను త‌గ్గించు కుని పార్టీకి స‌హ‌క‌రించ‌డంలోనూ.. ముందుకు రావ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. తాజాగా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా లో జ‌రిగిన ఘ‌ట‌న‌.. కాంగ్రెస్‌లో లుక‌లుక‌ల‌ను మ‌రోసారి తెర‌మీదికి తెచ్చింది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ద‌ళిత సామాజిక వ‌ర్గాన్ని త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్న కాంగ్రెస్‌.. ఈ క్ర‌మం లో దళిత గిరిజన దండోరా సభకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 9న సోమ‌వారం.. ఈ స‌భ‌ను నిర్వ‌హించ‌డం ద్వారా.. ద‌ళితులు త‌మ ప‌క్షానే ఉన్నార‌ని చెప్పుకొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్ర‌య‌త్నించారు. అయితే.. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ఆదిలోనే అనేక స‌మ‌స్య‌లు చుట్టుమ‌ట్టాయి. ప్ర‌ధానంగా ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న వివాదం ప‌రిష్క‌రించ‌డం రేవంత్‌కు త‌ల‌కు మించిన బారంగా మారింది. అంతేకాదు.. తాను చేసిన ప‌నిని వెన‌క్కి తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి కూడా ఏర్ప‌డింది.

విష‌యంలోకి వెళ్తే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుల మధ్య చాలాకాలం గా విభేదాలు నెలకొన్నాయి. ఇద్ద‌రు నేత‌లు.. కూడా ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో ఎవ‌రికి వారు పార్టీ అగ్ర‌నాయ‌కుల ద‌గ్గ‌ర ప‌లుకుబ‌డి సాధించి..త‌మ ప‌నులు చేయించుకుంటున్నారు. ఇదిలావుంటే.. ఈ నెల 9న నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ఇంద్ర‌వెల్లి స‌భ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన బాధ్య‌త‌ల‌ను పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావుకు అప్పగించారు. ఈ ప‌రిణామం.. మహేశ్వర్ రెడ్డికి న‌చ్చ‌లేదు. దీంతో దీనిని ఏకపక్షంగా నిర్ణ‌యంగా పేర్కొన్న ఆయ‌న ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పశ్చిమ ప్రాంతంలో జరిగే సభకు తూర్పు ప్రాంతానికి చెందిన సాగ‌ర్‌కు ఎలా బాధ్యతలు అప్పగిస్తారని ఏకంగా రేవంత్‌నే నిలదీశారు.

దీంతో మహేశ్వర్ రెడ్డిని చల్లబరిచేందుకు రేవంత్... పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీలను రంగంలోకి దించారు. ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన సీనియ‌ర్లు.. పార్టీ నాయకత్వంపై అలక వీడాలని,పార్టీలో ఎవరికి ఇచ్చే ప్రాధాన్యం వారికి ఉంటుందని సీనియర్లు మహేశ్వర్ రెడ్డితో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మహేశ్వర్ రెడ్డి మాత్రం ఇంద్రవెల్లి సభ నిర్వహణ బాధ్యతల నుంచి కొక్కిరాలను తప్పించాల్సిందేనని డిమాండ్ చేయడంతో అందుకు అంగీకరించక తప్పలేదు. తాజాగా ఆ బాధ్యతలను కాంగ్రెస్ నాయకత్వం ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్‌కు అప్పగించింది. ఈ ప‌రిణామం మ‌హేశ్వ‌ర‌రెడ్డి వ‌ర్గంలో ఆనందం నింప‌గా.. సాగ‌ర్ వ‌ర్గంలో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌య్యేలా చేసింది.

వాస్త‌వానికి ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన హుజురాబాద్ ఎన్నికల సన్నద్ధ సమావేశానికి కూడా మహేశ్వర్ రెడ్డి దూరంగా ఉన్నారు. మరోవైపు ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లను ఇటీవల ఎమ్మెల్యే సీతక్క, ప్రేమ్ సాగర్ రావు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం ప్రేమ్ సాగర్ రావుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సభ గడువు దగ్గరపడుతున్న సమయంలో ఈ విభేదాలు పార్టీకి శ్రేయస్కరం కాదని భావించిన రేవంత్ రెడ్డి... మహేశ్వర్ రెడ్డి వద్దకు సీనియర్లను పంపించి రాయబారం నెరిపారు.

నిజానికి సభ నిర్వహణ బాధ్యతలు అనూహ్యంగా సాగ‌ర్‌ చేతికి ద‌క్కాయి. అడగకుండానే రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలు అప్పగించారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణ పనుల్లో ఆయన నిమగ్నమై ఉండగానే అనూహ్యంగా ఇప్పుడాయన్ను బాధ్యతల నుంచి తప్పించారు. ఇది రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమని... కాబట్టి ఇందులో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ బాధ్యత ఏమీ ఉండదని ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నప్పటికీ... ఆయన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో కొక్కిరాలకు ప్రాధాన్యం తగ్గించినట్లయింది. ఏదేమైనా.. ఇలాంటి ప‌రిణామాలు ఒక్క ఆదిలాబాద్‌కే ప‌రిమితం కాలేద‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి వీటిని రేవంత్ ఇలానే ప‌రిష్క‌రిస్తే.. మున్ముందు.. మ‌రింత ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.