Begin typing your search above and press return to search.

బాబుకు మరో షాక్... బీజేపీలోకి రేపల్లె ఎమ్మెల్యే?

By:  Tupaki Desk   |   26 Jun 2019 6:15 PM IST
బాబుకు మరో షాక్... బీజేపీలోకి రేపల్లె ఎమ్మెల్యే?
X
తాజా ఎన్నికల్లో గతంలో ఏనాడూ ఎదురుకాని రీతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీడీపీకి వరుస షాకులు తప్పడం లేదు. ఈ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తాను తలచుకుంటే టీడీపీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదని సంచలన కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను టీడీపీలా, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిలా పార్టీ ఫిరాయింపులకు పాల్పడబోనని కూడా జగన్ చెప్పడంతో బాబు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ రిలీఫ్ ఎంతోకాలం నిలవలేదు. ఏపీలో సొంతంగా బలోపేతం కావాలని భావిస్తున్న బీజేపీ... ఆపరేషన్ కమల పేరిట కొత్తగా తనదైన శైలిలో టీడీపీ నేతలను లాగేస్తోంది. ఇప్పటికే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న సీఎం రమేశ్, సుజనా చౌదరిలతో పాటు నలుగురు రాజ్యసభ సభ్యులను లాగేసింది.

తాజాగా గుంటూరు జిల్లాలో కనాకష్టం మీద రేపల్లె నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అనగాని సత్యప్రసాద్ ఇప్పుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లంకా దినకర్, మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ఢిల్లీ ఫ్లైటెక్కిన అనగాని... అక్కడ బీజేపీ ముఖ్యులతో భేటీ అయ్యారట. ఈ వార్త ఇప్పుడు టీడీపీలో ప్రత్యేకించి చంద్రబాబు కోటరీలో పెను ప్రకంపనలే సృష్టిస్తోంది. తాజా ఎన్నికల్లో అనగాని తన సొంత బలంతోనే, లేదంటే పార్టీ బలంతోనే గెలవలేదు. సినీ నటి సమంత మద్దతు తీసుకుని, ఆమెతో ప్రచారం చేయించుకుని గడ్డన పడ్డారు. అంటే ఎన్నికల్లో సమంత మద్దతుతో గట్టెక్కిన అనగాని... ఇప్పుడు బాబుకు షాకిస్తూ బీజేపీ పంచన చేరిపోతున్నారన్న మాట.

ఇటీవలే బీజేపీలో చేరిపోయిన టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు స్వయంగా అనగాని బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బీజేపీ నేతలతో కలిపించారట. అంతేకాకుండా అనగానితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారన్న వార్తలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరన్న విషయంపై టీడీపీలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ లెక్కన అనగాని ఒక్కరే షాకిస్తారా? తనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లి ఒకేసారి త్రిబుల్ షాకిస్తారో చూడాలి.