Begin typing your search above and press return to search.

అధ్యక్ష పదవికి రాహుల్ పోటీ చేస్తారో? లేదో? : చిదంబరం

By:  Tupaki Desk   |   12 March 2021 4:00 PM IST
అధ్యక్ష పదవికి రాహుల్ పోటీ చేస్తారో? లేదో? : చిదంబరం
X
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కేవలం తమ పార్టీ సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారని, అలా కాకుండా టీవీ జర్నలిస్టులు మా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోరని ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం ఎద్దేవా చేశారు. సొంతంగా ఒక పార్టీని పెట్టుకుంటే అధ్యక్షుడిని జర్నలిస్టులు ఎన్నుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. ఓ జాతీయ టీవీ చానల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 99 శాతం మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఉండే కార్యకర్తలు కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు.

ఇప్పటి వరకు తాను 35 బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నానని చిదంబరం తెలిపారు. ఎంతో మంది కార్యకర్తలతో భేటీ అయ్యానని చెప్పారు. 100 మంది కార్యకర్తల్లో 99 మంది రాహుల్ నే అధ్యక్షుడిగా కోరుకుంటున్నారని తెలిపారు. అయితే, పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ పోటీ చేస్తారా, లేదా అనే విషయం తనకు తెలియదని చెప్పారు. అధ్యక్ష పదవికి ఇతర నాయకులు కూడా పోటీ పడొచ్చని, తాము మాత్రం పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు.

తమ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉందని, అయినా నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని చిదంబరం ప్రకటించారు. అన్ని రాజకీయ పక్షాలూ ఎత్తు పల్లాలను ఎదుర్కొంటున్నట్లు గానే, కాంగ్రెస్ కూడా ఎదుర్కొంటోందని, తమలో కొన్ని లోపాలున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తమ స్థానాలను పదిలం చేసుకోవాల్సిందేనని నిర్మొహమాటంగా వెల్లడించారు. అయితే అందరూ ఐకమత్యంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్నారు. గత రెండున్నరేళ్ల కంటే ముందు పార్టీ ఎన్నో విజయాలను సాధించిందని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు తాత్కాలికమేనని అన్నారు.