Begin typing your search above and press return to search.

దసరా తరువాత సినిమా : ఏపీ రాజకీయాన్ని పవన్ మార్చేస్తారా...?

By:  Tupaki Desk   |   23 Jun 2022 2:30 AM GMT
దసరా తరువాత సినిమా :  ఏపీ రాజకీయాన్ని పవన్ మార్చేస్తారా...?
X
ఎవరు కలగన్నారు అన్న ఎన్టీయార్ పార్టీ పెడతారని, తొమ్మిది నెలలు ఊరూరా తిరుగుతారని, ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలోనే కూర్చుంటారని. అలాగే ఎవరు ఊహించారు జగన్ అనే ఒక యువకుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పదేళ్ళు తిరగకుండానే సీఎం కుర్చీ పట్టేస్తారని. ఎవరు అనుకున్నారు చిన్నల్లుడు ట్యాగ్ తో టీడీపీలో దశాబ్దాలుగా పనిచేసిన చంద్రబాబు ఆ తరువాత పాతికేళ్ళు టీడీపీ కాడెను మోస్తారని, అన్న గారు లేకపోయినా పసుపు రెపరెపలు ఇంకా అలా కదిలేలా చేస్తారని.

ఇదంతా కూడా సాధ్యపడింది అంటే వారిని జనాలు మెచ్చారు అని ఒక్క మాటతో అనేయకూడదు. వారు కూడా జనాలు మెచ్చేలా చేసుకున్నారు. కష్టపడ్డారు. తమ రాజకీయ బాటను వారే వేసుకున్నారు. తమ తలరాతను వారే దిద్దుకున్నారు. కఠోరమైన శ్రమ తరువాతనే అందలాలు వారి దరిని చేరాయి.

ఇపుడు జనసేనాని పవన్ అదే బాటలో పయనించాలని చూస్తున్నారు. అదే జనం బాట. ఎండలను కొండలను వానలను కోనలను దాటుకుని సాగే కఠినమైన బాట. పవన్ జనసేన పెట్టాక ఇంతకాలం చేసింది పార్ట్ టై, పాలిటిక్స్ మాత్రమే అని అంతా అంటారు. అనడం కాదు అది నిజమే అనిపిస్తుంది. ఆయన ఇలా వచ్చి అలా తిరిగి మళ్ళీ వెళ్లిపోతూంటారు. దాంతో పూర్తి ఇంపాక్ట్ ఆయన జనాల మీద కనిపించేలా చేయలేకపోతున్నారు.

అయితే పవన్ రియలైజ్ అయ్యారో లేక సలహాదారులు చెప్పారో తెలియదు కానీ ఆయన ఏడాదికి పైగా కాలమంతా రోడ్డు మీదనే ఉంటాను అంటున్నారు. తన బస్సు యాత్రను జనం రూట్లో తిప్పుతాను అని చెబుతున్నారు. రాత్రులు పగళ్ళూ అన్నీ జనంలోనే అని కూడా పవన్ చెబుతున్నారు. నిజంగా పవన్ కనుక అలా చేస్తే అది సంచలనమే. పవన్ ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో జనంలోకి వచ్చిన రోజులన్నీ లెక్క కట్టినా గట్టిగా కొన్ని నెలలు కూడా ఉండవు.

కానీ ఈసారి అలా కాదు, జనంతోనే తేల్చుకుంటాను అని పవన్ పంతం పట్టి బరిలోకి దిగుతున్నారు. నిజంగా ఇది గొప్ప మార్పే. జనంలో ఉన్న వారు, జనాన్ని నమ్మినవారు మోసపోయిన దాఖలాలు లేవు. అందుకే పవన్ దసరా తరువాత అసలైన సినిమా చూపిస్తాను అని వైసీపీ సర్కార్ పెద్దలకు వార్నింగ్ ఇచ్చేశారు.

మరి పవన్ ఏడాది పాటు జనంలో ఉంటే ఏపీ రాజకీయం మారుతుందా. ఇప్పటిదాక రెండు పార్టీల మధ్యనే చీలిన రాజకీయం మూడవ పార్టీ వైపుగా సాగుతుందా. పవన్ బస్సు యాత్ర ముగిసే సమయానికి మూడు ముక్కలాటగా పాలిటిక్స్ లో కొత్త ట్విస్టులు చూడగలమా. అంటే జరిగినా జరగవచ్చు అన్న రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ఎందుకంటే జనాలు ఎపుడూ తమకు సేవ చేసే నాయకులను కోరుకుంటారు. ఫలానా వారికే ఫలానా పార్టీకే అని వారు తుదిదాకా కట్టుబడిపోరు.

అందువల్ల పవన్ ఆ దిశగా తనను తాను ఒక పరిపూర్ణ నాయకుడిగా కనుక ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఆయనకూ ఒక రాజకీయ వాటా ఏపీలో ఉండే చాన్స్ ఉంది. ఇక ఏపీలో చూస్తే రాజకీయ శూన్యత అయితే లేదు. బలంగా వైసీపీ, టీడీపీ ఉన్నాయి. ఈ రెండు పార్టీల ఓట్ల షేర్ చూస్తే తొంబై శాతంగా ఉంది. మరి ఆ మిగిలిన పది శాతం ఓట్ల షేర్ ని మాత్రమే పవన్ సాధిస్తారా లేక ఈ రెండు పార్టీల ఓట్ల షేర్ ని కూడా చీల్చి తనకంటూ కొత్త ఓటు బ్యాంక్ ని బిల్డప్ చేసుకుంటారా అన్నది చూడాలి.

ఇక ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. అది జనసేన నమ్ముతున్నది దానినే. ఏపీలో ఇప్పటిదాకా పోలింగ్ ఏ డెబ్బయి శాతమో జరిగితే అందులో టీడీపీ వైసీపీ ఓట్ల షేర్ తొంబై శాతం. అదే ఓట్లు వేయని వారు, పోలింగునకు రాని వారు మరో ముప్పయి శాతం ఉన్నారు. మరి పవన్ వారిని కూడా ఆకట్టుకుని కొత్తగా వారిని తన ఓట్లుగా మార్చుకుంటే అపుడు ఏపీలో అసలైన రాజకీయ సమరం స్టార్ట్ అవుతుంది. ఏది ఏమైనా ఏపీలో జనసేన బస్సు యాత్ర మాత్రం వర్తమాన రాజకీయాలలో ఒక కుదుపుగా మలుపుగా భావించాల్సి ఉంటుంది.