Begin typing your search above and press return to search.

విభజన సమస్యలు పరిష్కారమవుతాయా ?

By:  Tupaki Desk   |   13 Jan 2022 5:56 AM GMT
విభజన సమస్యలు పరిష్కారమవుతాయా ?
X
సమస్యల పరిష్కారానికి చర్చలు జరుగుతున్న తీరు చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే సమస్యలు పరిష్కరించుకోవాల్సిన రెండు ప్రభుత్వాలు కూడా తమ వాదనకే కట్టుబడున్న కారణంగా అంగుళం కూడా పరిష్కార ప్రయత్నాలు ముందుకు కదలటం లేదు. నీటి కేటాయింపులు కావచ్చు, విద్యుత్ బకాయిలు కావచ్చు, ఆస్తుల విభజన కావచ్చు, ఢిల్లీలోని ఏపీ భవన పంపకాలు కావచ్చు.

నిజానికి విభజన చట్టంలో చెప్పినట్లుగా ఆస్తులను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలి. ఏపీకి 58 శాతం, తెలంగాణాకు 42 శాతం రావాల్సుంది. అయితే ప్రతి విషయంలోను తెలంగాణా ప్రభుత్వం గొడవలు పడుతునే ఉంది. రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారం విషయంలో కేసీయార్ నెగిటివ్ గా ఉన్న కారణంగా ఉన్నతాధికారులు కూడా ముందడుగు వేయలేకపోతున్నారు. కేసీయార్ ఎందుకు నెగిటివ్ గా ఉన్నారంటే విభజన ఎంత ఆలస్యమైతే తెలంగాణా ప్రభుత్వానికి అంత లాభం.

విభజన చట్టం ప్రకారం పంపిణీ కావాల్సిన ఉమ్మడి ఆస్తుల్లో ఎక్కువ భాగం తెలంగాణాలోనే ఉన్నాయి. ఆస్తులను తరలించటం సాధ్యం కాదు కాబట్టి వాటికి విలువ కట్టి ఏపీకి రావాల్సిన 58 శాతం డబ్బు రూపంలో ఇచ్చేయాలి. హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల అన్నింటినీ కేసీయార్ ఏకపక్షంగా సొంతం చేసేసుకున్నారు. వాటి విలువ కట్టినా డబ్బులు చెల్లించటం లేదు. అలాగే ఏసీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు రు. 6 వేల కోట్లనూ ఇవ్వడం లేదు. ఇక జల వివాదాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఏ విషయంలో అయినా సరే సమస్యల పరిష్కారానికి కేసీయార్ సుముఖంగా లేరని తెలిసిపోతోంది. కేసీయార్ సుముఖంగా లేరు కాబట్టే ఉన్నతాధికారులు కూడా ముందడుగు వేయటం లేదు. కాబట్టి ఏపి ఎంత మొత్తుకున్నా విభజన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం లేదని అర్ధమవుతోంది. అందుకనే కేంద్రాన్ని జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించమని ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే రెండు రాష్ట్రాల మధ్య జోక్యం చేసుకునేందుకు కేంద్రం ఇష్టపడలేదు. కాబట్టి ఎన్ని సంవత్సరాలైన సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం కుదరటం లేదు.