Begin typing your search above and press return to search.

పనబాక నామినేషన్ వేస్తారా ?

By:  Tupaki Desk   |   19 March 2021 7:15 AM GMT
పనబాక నామినేషన్ వేస్తారా ?
X
తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో తెలుగుదేశంపార్టీ తరపున పనబాక లక్ష్మీ పోటీ విషయంలో స్పష్టత వచ్చిందా ? గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన అలాగే అనిపిస్తోంది. ఈనెల 24వ తేదీన పనబాక తన నామినేషన్ వేయబోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. సమావేశంలో పనబాక కూడా ఉన్నారు. అయితే నామినేషన్ విషయంలో ఆమె మాత్రం ఏమీ మాట్లాడలేదు.

ఈనెల 20వ తేదీనుండి పనబాక ప్రచారంలోకి దిగుతున్నట్లు చంద్రబాబే ప్రకటించారు. మూడు రోజుల పాటు ప్రచారం చేసిన తర్వాత అభ్యర్ధి నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ వేస్తారని చెప్పారు. నామినేషన్ కు ముందు తర్వాత కూడా పనబాక పార్టీ నేతలతో సమావేశం అవుతారని వివరించారు. పార్టీ గెలుపుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో మాజీ మంత్రిని ఇన్చార్జిగా నియమిస్తానన్నారు. అలాగే ప్రతి క్లస్టర్ కు ఒక ఇన్చార్జిని నియమించబోతున్నట్లు చెప్పారు. క్లస్టర్లు, ఇన్చార్జిల నియామకం అంతా వినటానికి బాగానే ఉన్నా క్షేత్రస్ధాయిలో పనిచేసేదెవరనేదే తేలలేదు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో చాలామంది టీడీపీ నేతలు పూర్తిగా డీలా పడిపోయారు. అధికారంలో ఉన్నపుడు పదవులు అనుభవించిన వారు, ఆర్ధికంగా నిలదొక్కుకున్న వారిలో అత్యధికులు పార్టీకి దూరంగా ఉంటున్నారు.

మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి ఇలాంటి సీనియర్లు కూడా కారణమే. ఈ పరిస్ధితుల్లో లోక్ సభ ఉపఎన్నిక రావటం పార్టీ నేతలకు నిజంగా ఇబ్బందిగానే ఉంది. క్షేత్రస్ధాయిలో పనిచేసేవారికే సమస్యలు తెలుస్తాయని పార్టీ నేతలే అంటున్నారు. ఎక్కడో పార్టీ ఆఫీసులోనో లేకపోతే హైదరాబాద్లోనో కూర్చుని చంద్రబాబు మాట్లాడటం కాదంటున్నారు మెజారిటి నేతలు. లోక్ సభ ఉపఎన్నిక కోసం చంద్రబాబు నియమించిన కమిటి విషయంలోనే నేతల్లో చాలామంది అసంతృప్తి ఫీలవుతున్నారు.

చంద్రబాబు నియమించిన ఐదుగురు సభ్యుల కమిటిలో ఒక్క కింజరాపు అచ్చెన్నాయుడు తప్ప మిగిలిన నలుగురికీ జనబలం లేదని పార్టీ నేతలే అంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా ఐదుసార్లు ఓడిపోయారు. బీద రవిచంద్రయాదవ్ ఇంతవరకు అసలు పోటీనే చేయలేదు. నారా లోకేష్ సంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అభ్యర్ధి భర్త పనబాక కృష్ణయ్య కు ప్రత్యక్షంగా జనాలతో సంబంధమే లేదు.

మాజీమంత్రి అమరనాధరెడ్డికి తిరుపతి లోక్ సభ స్ధానం పరిధితో సంబంధమే లేదు. ఇలాంటి వాళ్ళని కమిటిలోని నియమించి సీనియర్ నేతలకు చంద్రబాబు ఎలాంటి సంకేతాలు ఇద్దామని అనుకుంటున్నారనే చర్చ పార్టీలోనే జరుగుతోంది. మరి ఈ ప్రశ్నకు చంద్రబాబు ఏమి సమాధానం చెబుతారో.