Begin typing your search above and press return to search.

మోడీ ఆశలకు మాయావతి చెక్ చెప్పినట్లే

By:  Tupaki Desk   |   5 Nov 2016 10:34 AM GMT
మోడీ ఆశలకు మాయావతి చెక్ చెప్పినట్లే
X
ఏది ఏమైనా.. కొద్ది నెలల్లో జరిగే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారు కమలనాథులు. 2019 ఎన్నికల్లో ఘన విజయానికి అవసరమైన కొత్త శక్తిని..ఉత్సాహాన్ని యూపీ అసెంబ్లీ ఎన్నికల విజయం ఇస్తుందని కమలనాథులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఇందుకోసం ఎంతవరకైనా సరే అన్నట్లుగా వ్యవహరించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. యూపీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వారు కదుపుతున్న పావులెన్నో.

ఇదిలా ఉంటే.. బీజేపీ కలలు సాకారం సాధ్యమయ్యే అవకాశం లేదని.. యూపీలో అధికారాన్ని చేపట్టటం అంత తేలికైన విషయం కాదని ఇప్పటివరకూ వెలువడిన సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. యూపీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ వచ్చే అవకాశమే లేదని.. సంకీర్ణంతోనే సర్కారు సాధ్యమని తేలుస్తున్నాయి.

అయితే.. బీజేపీ మాత్రం అత్యధిక సీట్లు సాధించే పార్టీగా అవతరిస్తున్న అంచనాలు ఉన్నాయి. అయితే.. ఏదో ఒక పార్టీతో జత కడితే కానీ యూపీలో అధికారపక్షంగా అవతరించే అవకాశం లేదన్న విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం అయితే..సమాజ్ వాదీతో కానీ.. మాయావతితో కానీ బీజేపీ జత కట్టే అవకాశం ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే.. అలాంటిదేమీ లేదన్న విషయాన్ని తేల్చి చెబుతున్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి.

ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకోవటం కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కానీ తాను చేయబోనని ఆమె స్పష్టం చేస్తున్నారు. 2003లో కేంద్రంలోని బీజేపీ సర్కారు తనను తాజ్ కారిడార్ లో టార్గెట్ చేసిన విషయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతున్నారు. బీజేపీ సర్కారు తన కుటుంబంపై దాడులు చేయించిందని.. ఆ టైంలో పార్టీ అధినేత కాన్షీ రాం చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నారని ఆమె గుర్తు చేస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. తమకు ఎవరి అవసరం లేదని ఆమె నమ్మకంగా చెబుతున్నారు.

సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు.. మైనార్టీల అండ తమ పార్టీకే ఉందని చెబుతున్న ఆమె.. 2014 ఎన్నికల్లో మైనార్టీలు ఎస్పీ (సమాజ్ వాదీ పార్టీ)కి ఓటు వేసి తప్పు చేశామని అర్థం చేసుకున్నారని..ఈ ఎన్నికల్లో మాత్రం వారి మద్దతు తమకే ఉంటుందని చెబుతున్నారు. కమలనాథులపై తనకున్న కోపాన్ని ఇంత విస్పష్టంగా వ్యక్తం చేయటం కమలనాథులకు కాస్తంత ఇబ్బంది కలిగిస్తుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/