Begin typing your search above and press return to search.

ఎంపీలపై అనర్హత వేటు పడుతుందా?

By:  Tupaki Desk   |   29 July 2022 6:33 AM GMT
ఎంపీలపై అనర్హత వేటు పడుతుందా?
X
శివసేన తిరుగుబాటు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని శివసేన సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కోరారు. శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 12 మంది ఎంపీలపై వెంటనే అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. శివసేనలోని సీనియర్ నేత, మంత్రిగా ఉన్నపుడు ఏక్ నాథ్ షిండే శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వాన్ని కూల్చేసిన తర్వాత తన వర్గంలోని 40 మంది ఎంఎల్ఏలను కలుపుకుని బీజేపీతో పొత్తు పెట్టుకుని షిండేయే ముఖ్యమంత్రయిపోయారు. దాంతో శివసేన పార్టీ, గుర్తుపైన కూడా ఇటు థాక్రు అటు షిండే వర్గాల మధ్య వివాదం మొదలైంది.

ఈ నేపధ్యంలోనే పార్టీలోని అన్నీస్ధాయిలో చీలికలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే పార్టీకి చెందిన 18 మంది లోక్ సభ ఎంపీల్లో కూడా చీలిక వచ్చింది. 12 మంది ఎంపీలు థాక్రేని వదిలేసి షిండేతో చేతులు కలిపారు. ఇపుడు ఆ 12 మంది ఎంపీలపైనే అనర్హత వేటువేయాలని సంజయ్ స్పీకర్ కు లేఖ రాశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే షిండేతో చేతులు కలిపిన 12 మంది ఎంపీలు థాక్రే నేతృత్వంలోని శివసేన జారీచేసిన విప్ ను ఉల్లంఘించలేదు. పైగా అసలు శివసేన పార్టీ తమదంటే కాదు తమదే అని రెండు వర్గాలు గొడవలు పడుతున్నాయి. కాబట్టి పార్టీ ఎవరిదని తేలేంతవరకు ఎంపీలపై యాక్షన్ తీసుకునే అవకాశం లేదు.

ఇదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ సహకారంతోనే షిండే ముఖ్యమంత్రి అయినపుడు ఇక లోక్ సభలో ఇదే బీజేపీ అనర్హత వేటు వేస్తుందా ? థాక్రేని దెబ్బకొట్టడమే ఉద్దేశ్యంతో షిండేని ముందు పెట్టి కథంతా నడిపించిందే బీజేపీ.

అలాంటి బీజేపీ నేత లోక్ సభ స్పీకర్ గా ఉన్నపుడు ఎంపీలపై అనర్హత వేటు ఎందుకుపడుతుంది ? కాకపోతే అనర్హత వేటుకు తాము లేఖ ఇచ్చినా స్పీకర్ పట్టించుకోలేదని థాక్రే వర్గం గోలచేయటానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు.