Begin typing your search above and press return to search.

కోహినూర్ మీద మోడీ సర్కారు మాట మారింది

By:  Tupaki Desk   |   20 April 2016 6:44 AM GMT
కోహినూర్ మీద మోడీ సర్కారు మాట మారింది
X
కీలకమైన అంశాల మీద ఏదైనా అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. అయితే.. మోడీ సర్కారు అలాంటి అంశాల్లో తప్పులు చేస్తుందన్న విషయం కోహినూర్ ఇష్యూలో రుజువైంది. భారతీయులకు భావోద్వేగ సంబంధం ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పిన సమాధానం దేశ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. కోహినూర్ దొంగలించలేదని.. బహుమతిగా ఇచ్చింది కాబట్టి దాన్ని తిరిగి తేలేమంటూ చేతులెత్తేసిన కేంద్ర సర్కారు.. ఇప్పుడు మాత్రం వెనక్కి తీసుకురావటానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తామని చెప్పుకొచ్చింది.

మూడు రోజుల్లో కోహినూర్ మీద కేంద్రానికి అంత ప్రేమ ఎందుకు పెరిగిపోయిందన్న సందేహం అక్కర్లేదు. కోహినూర్ మీద సుప్రీంకోర్టులో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ చెప్పిన మాటపై భారతావని భగ్గుమనటంతో తమ మాటల్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. చరిత్రలోని అంశాల్ని మాత్రమే ఉటంకించామని.. కోహినూర్ ను వెనక్కి తీసుకొచ్చే విషయంలో తాము ఆశావాహ దృక్ఫధంతో ఉన్నట్లుగా పేర్కొంది. అయితే ఈ మార్పు మొత్తం కూడా దేశ ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహంతోనే తప్పించి మరొకటి కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. జనాగ్రహంతో మాటలు మార్చే ప్రభుత్వాలు.. ప్రజల ఆకాంక్షల్ని నిజాయితీతో పూర్తి చేస్తాయా? ఈ సందేహానికి సంతృప్తికర సమాధాన్ని ఇచ్చేవారెవరు..?