Begin typing your search above and press return to search.

పీవీ కుమార్తెకు ఊహించని పదవి కేసీఆర్ ఇస్తారా?

By:  Tupaki Desk   |   25 March 2021 5:30 PM GMT
పీవీ కుమార్తెకు ఊహించని పదవి కేసీఆర్ ఇస్తారా?
X
రాజకీయ చాణక్యంలో ఆరితేరిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎవరిని బరిలోకి దించి ఎలా ఓడగొట్టాలన్నది మూడో కంటికి తెలియకుండా పర్ ఫెక్ట్ గా స్కెచ్ గీస్తారు. అది అమలు చేశాక నోరు వెళ్లబెట్టడం ప్రతిపక్షాల వంతు అవుతుంది. కొన్ని నెలల క్రితం వరకు మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి రాష్ట్రంలో అసలు గుర్తింపు లేని వ్యక్తి. ఆమె తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎప్పుడూ ఆసక్తి చూపని విద్యావేత్తగా ఉన్నారు. రాజకీయాల్లో కొంతకాలం పనిచేసిన ఆమె ఇద్దరు సోదరులు ఇప్పుడు యాక్టివ్ లేకుండా పక్కకు తప్పుకున్నారు. ఇక వీరి కుటుంబాన్ని ఆదరించడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాలేదు.

పివి నరసింహారావు శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని పాలక తెలంగాణ రాష్ట్ర సమితి వాణిదేవిని అకస్మాత్తుగా వెలుగులోకి తెచ్చింది. కేసీఆర్ ఆమెను పివి శతాబ్ది ఉత్సవాల కమిటీలో కీలక సభ్యురాలిగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్-రంగా రెడ్డి-మహాబుబ్‌నగర్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి ఎంఎల్‌సి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆమెను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.

కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాణిదేవిని బలిపశువు చేస్తున్నాడని చాలా మంది భావించారు. కాని కేసీఆర్ తన శక్తియుక్తులు అన్నీ సమీకరించి, ఆమెకు ఎమ్మెల్సీగా నిలబెట్టి సీటును గెలిపించాడు. అందువల్ల, వాణీ తన రాజకీయ ఇన్నింగ్స్‌ను అనుకోని రీతిలో ప్రారంభించాడు.

తాజా నివేదికల ప్రకారం, వాణిదేవికి మరింత పెద్ద పోస్టు ఇవ్వడానికి కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఆమె ఇమేజ్‌ను మాత్రమే కాకుండా, ప్రజలలో టిఆర్ఎస్ విశ్వసనీయతను కూడా పెంచుతుందని భావిస్తున్నాడట..

కేసీఆర్ రాష్ట్ర శాసనమండలి చైర్‌పర్సన్ పదవిని వాణిదేవికి ఇవ్వవచ్చని తెలిసింది. తద్వారా ఆమె కేవలం కౌన్సిల్ సభ్యురాలిగా కాకుండా గౌరవప్రదమైన పాత్రను పోషిస్తుందని అనుకుంటున్నారు

ఇక వాణిదేవికి క్యాబినెట్ పదవిని ఇవ్వాలని అనుకున్నా.. ఇప్పటికే తన సొంత కుమార్తె కె కవితతో సహా పార్టీ నాయకుల నుండి గట్టి పోటీ ఉంది. కాబట్టి, ఆమెకు రాష్ట్ర శాసన మండలి చైర్‌పర్సన్ పదవి ఇవ్వడం ద్వారామాజీ ప్రధాని కుమార్తెగా ఆమెకు గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నాడట..

ప్రస్తుతం మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్నారు. అయితే ఆయన చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఈ పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. అందువల్ల, కేసీఆర్ అతని స్థానంలో వాణి దేవిని భర్తీ చేయవచ్చని తెలుస్తోంది. "నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తరువాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.