Begin typing your search above and press return to search.

కొత్త రెవెన్యూ చట్టంతో కేసీఆర్ కల నిజం కానుందా?

By:  Tupaki Desk   |   8 Sept 2020 1:20 PM IST
కొత్త రెవెన్యూ చట్టంతో కేసీఆర్ కల నిజం కానుందా?
X
వ్యక్తుల్ని మార్చటమే కష్టం. అలాంటిది వ్యవస్థను మార్చాలనుకోవటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి సాహసానికి చాలామంది పాలకులు ఇష్టపడరు. పలు అంశాలకు సంబంధించి స్టేటస్ కో (యథాతధస్థితి) కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మొండి మనిషి. ప్రతి విషయంలోనూ తన మార్కు కనిపించాలన్న యోచనతో పాటు.. తన హయాంలో పాలనా పరంగా కీలక మార్పులు చోటు చేసుకోవాలన్న అభిలాష ఎక్కువ.

ఉద్యమ నేపథ్యంలో రావటం.. ఆ సందర్భంగా ఎన్నో ఆశల్ని.. ఆకాంక్షల్ని వ్యక్తం చేసేవారు. అదే పనిగా నిర్వహించే భేటీలు.. మేథోమధనాల సందర్భంగా పవర్ కానీ చేతిలో ఉంటే.. చేయాల్సినవెన్నో ఉన్నాయన్న మాట తరచూ ఆయన నోటి నుంచి వచ్చేది. ఆయన కోరుకున్నట్లే అధికారం చేతిలోకి రావటం.. తొలిసారి ప్రభుత్వం కుదురుకునేలా చేయటమే కాదు.. రాజకీయ ప్రత్యర్థుల పని పట్టటం.. విపక్షాలు బలహీనమయ్యేలా చేసిన ఆయన.. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పాలనా పరంగా మార్పులు.. చేర్పుల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.

కరోనా కారణంగా తన యాక్షన్ ప్లాన్ ఆర్నెల్లు ఆల్యమైందని చెప్పాలి. ఇప్పటికిప్పుడు కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయటం సాధ్యం కాదన్న విషయంపై క్లారిటీ తెచ్చుకున్న ఆయన.. తన ఎజెండాను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అత్యంత అవినీతి శాఖగా అందరూ అభివర్ణించే రెవెన్యూ శాఖ మీద ఆయన యుద్ధం ప్రకటించారు.

నిజానికి ఇదేమీ అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే.. రెవెన్యూ శాఖలో ఎన్ని వేల కోట్ల అవినీతి ఉంటుందో అందరికి తెలిసిందే. దీన్లో.. లక్షలాది మందికి ప్రయోజనాలు ఉంటాయి. అలాంటి వాటికి చెక్ పెట్టటం అంటే తేలికైన విషయం కాదు. కానీ.. తాను అనుకున్నది ఏమైనా సరే.. ఎంతవరకు వెళ్లైనా సరే.. పూర్తి చేయాలన్న పట్టుదల కేసీఆర్ కు ఎక్కువ. ఈ కారణంతోనే తాజాగా రెవెన్యూ శాఖ కొత్త చట్టానికి తుది మెరుగులు దిద్దటం.. ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టటానికి ముందే.. కీలక నిర్ణయాల్ని వరుస పెట్టి తీసేసుకుంటున్నారు.

సోమవారం ఉదయం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయటం.. మరోవైపు రిజిస్ట్రేషన్లను నిలిపివేయటంతో పాటు ఆ శాఖకు సెలవులు ఇచ్చేశారు. వీఆర్వోల దగ్గర ఉన్న రెవెన్యూ రికార్డుల్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు.. అన్నింటికి కలెక్టర్లకు దఖలు పర్చాలని ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ చట్టంలో కీలక మార్పులతో పాటు.. రిజిస్ట్రేషన్ల విషయంలోనూ విప్లవాత్మక మార్పుల దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం రిజిస్ట్రేషన్లలో ఎమ్మార్వోలకు ఉండే అధికారాల్ని ప్రభుత్వం సమీక్షించి.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను ఎమ్మార్వోలకు అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గృహ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్టార్ లకు అప్పచెబుతారని చెబుతున్నారు. ఇప్పుడు జరిగే మార్పులన్నీ రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతితో పాటు.. రికార్డుల్ని ఇట్టే టాంపర్ చేసే అవకాశాలకు చెక్ పెట్టటమే లక్ష్యం. సీఎం కేసీఆర్ ఉద్దేశం బాగానే ఉన్నా.. అదెంతవరకు వర్క్ వుట్ అవుతుందన్న విషయం రెవెన్యూ బిల్లు బయటకు వస్తే కానీ మరింత క్లారిటీ వస్తుంది. ఏమైనా.. గతం కంటే వర్తమానం బాగుంటుందన్న మాటకు తగ్గట్లే.. అవినీతిని తగ్గించే విషయంలో మార్పు అయితే ఖాయమంటున్నారు.