Begin typing your search above and press return to search.

జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ రాయ‌నున్న రొమాంటిక్ న‌వ‌ల రాయ‌నున్నారా?

By:  Tupaki Desk   |   27 Aug 2022 5:46 AM GMT
జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ రాయ‌నున్న రొమాంటిక్ న‌వ‌ల రాయ‌నున్నారా?
X
సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ ప‌ద‌వీకాలం ఆగ‌స్టు 26తో ముగిసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేష‌న్ ఘ‌నంగా స‌న్మానించింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా త‌న ప్ర‌సంగంతో న‌వ్వులు పూయించారు.

జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు తెలుగు భాష‌పైన మంచి ప‌ట్టు ఉంద‌ని.. తెలుగు సాహిత్య‌మంటే ఆయ‌న‌కు మ‌క్కువ ఎక్కువ‌ని తుషార్ మెహ‌తా తెలిపారు. త‌న‌కు విశ్వ‌స‌నీయంగా తెలిసిన‌దాన్ని బట్టి ఆయ‌న ఒక రొమాంటిక్ న‌వ‌ల రాయ‌బోతున్నార‌ని స‌ర‌దాగా న‌వ్వుతూ వ్యాఖ్యానించారు. న‌వ‌ల రాయ‌డానికి ఆయ‌న‌ను ఎవ‌రు ప్రేరేపించారో తెలియ‌ద‌న్నారు. దీంతో వేదిక‌పై ఉన్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌తోపాటు మిగిలిన‌వారు న‌వ్వుల్లో మునిగిపోయారు.

తుషార్ మెహ‌తా మాట‌ల‌కు న్యాయమూర్తులు..న్యాయవాదులు నవ్వుతూ చ‌ప్ప‌ట్లు కొడుతూ త‌మ‌ మద్దతు ప్రకటించారు. కొన్నేళ్ల త‌ర్వాత‌ ప్రస్తుత న్యాయమూర్తులంతా తాము ఒక తెలుగు కవితో కలిసి పని చేశామని చెప్పుకోవాల్సి వస్తుందంటూ తుషార్ మెహ‌తా త‌న స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు.

సీజేఐగా ఎన్వీ రమణ గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయమూర్తుల ఖాళీలను భ‌ర్తీ చేశారన్నారు. కోర్టుల్లో మౌలిక వసతుల కల్పినలో కీలకంగా వ్యవహ‌రించార‌ని గుర్తు చేశారు. న్యాయమూర్తిగా వెలువరించిన తీర్పుల్లో ఆయ‌న తనదైన ముద్ర వేశారని చెప్పారు. సామాన్యుడు అర్థం చేసుకొనే విధంగా ఆయ‌న తీర్పులు ఉండేవ‌న్నారు. ఆయ‌న ఏనాడు దురుసుగా.. గట్టిగా వ్యవహరించిన సందర్భాలు లేవన్నారు. ప్రతీ ఒక్కరితో ప్రేమ, ఆప్యాయతతో వ్యవహరించేవారని కొనియాడారు.

ఇక ఆ త‌ర్వాత జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ మాట్లాడుతూ రొమాంటిక్ నవల రాయడానికి ప్లాన్ చేస్తున్నాననే సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వాదనను తోసిపుచ్చారు. ఇది కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నివేదికల్లానే త‌ప్పు అని న‌వ్వుతూ వ్యాఖ్యానించారు.

"మీ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికల ప్రకారం.. నేను తెలుగులో రొమాంటిక్ నవల రాస్తానన్న సమాచారం సరైనది కాదని నేను చెప్పాలనుకుంటున్నాను" అని ఎన్వీ ర‌మ‌ణ స‌ర‌దాగా అన్నారు. అయితే ఏదైనా రాసే అవ‌కాశ‌ముంది అని తెలిపారు. సాహిత్యం మీద ఏదైనా రాస్తా అని ఎన్వీ ర‌మ‌ణ చెప్పారు.

కాగా సీజేఐ ఎన్వీ రమణ ప‌ద‌వీ విర‌మ‌ణ‌తో నూతన సీజేఐగా యూయూ లలిత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయ‌న‌తో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణ స్వీకారం చేయించనున్నారు.