Begin typing your search above and press return to search.

టీడీపీకి సూపర్ జంబో కార్యవర్గమా?

By:  Tupaki Desk   |   7 Nov 2020 11:00 PM IST
టీడీపీకి సూపర్ జంబో కార్యవర్గమా?
X
చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. 13 జిల్లాల్లోని ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీకి 219 మందితో చంద్రబాబునాయుడు రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించారు. ఇంత పెద్ద సైజులో రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేయటం బహుశా ఇదే మొదటిసారేమో. ఈ కమిటిలో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులను చంద్రబాబు నియమించారు. అన్నింటికన్నా విచిత్రమేమిటంటే రాష్ట్ర కార్యదర్శులుగా 108 మందిని నియమించటం.

మొన్నటి ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఘోర ఓటమి తర్వాత చాలామంది నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొంతమంది వైసీపీలో చేరితో మరికొందరు బీజేపీలో చేరిపోయారు. వైసీపీలో చేరటానికి ఇంకా చాలమంది నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఇతర పార్టీల నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తు జగన్మోహన్ రెడ్డి బార్లా గేట్లు తెరవ లేదు. అందుకనే టీడీపీకి చెందిన నలుగురు ఎంఎల్ఏలు పార్టీకి దూరమయ్యారే కానీ వైసీపీలో చేరలేదు. గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ, గుంటూరు వెస్ట్ ఎంఎల్ఏ మద్దాలి గిరికుమార్, చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్ లు పార్టీకి దూరంగా జరిగారు.

అయితే వైజాగ్ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ మాత్రం తాను టీడీపీకి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో జాతీయ కమిటి, పాలిట్ బ్యూరోలో సభ్యులను నియమిస్తు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కాస్త ఇబ్బందిగా మారింది. ఎందుకంటే సీనియర్లయిన తమను చంద్రబాబు గుర్తించలేదని కొందరు, తమను చంద్రబాబు దూరం పెట్టేశాడంటు మరికొందరు పార్టీపై అలిగారు. కొందరైతే ఏకంగా చంద్రబాబుకు తమ నిరసన లేఖలను అందించారు.

ఈ విషయాలన్నింటినీ గుర్తుంచుకునో ఏమో ఏకంగా 219 మందితో భారీ రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించినట్లున్నారు. ఈ పదవుల్లో సామాజిక సమతూకంగా కూడా బీసీలకు 41 శాతం, ఎస్సీలకు 11, ఎస్టీలకు 3, మైనారిటీలకు 6 శాతం కేటాయించారు. బహుశా కార్యవర్గంలో నియమించటానికి సీనియర్ నేతలెవరు మిగల్లేదేమో. ఇదే సందర్భంలో చంద్రబాబు నియమించిన పార్టీ కార్యవర్గంలోని నేతలపై అప్పుడే అసంతృప్తులు మొదలైపోయాయి. ఎందుకంటే గడచిన ఏడాదిన్నరగా పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను కూడా చంద్రబాబు కార్యవర్గంలో నియమించేశారు.

ప్రత్తిపాటి పుల్లారావు, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యానందరావు, దాట్ల సుబ్బరాజు, బూరగడ్డ వేదవ్యాస్, సుజయకృష్ణ రంగారావు, బీవీ జయనాగేశ్వరరెడ్డి, హనుమంతరాయ చౌదరి, పయ్యావుల కేశవ్, భూమా అఖిలప్రియ, గౌతు శిరీష తదితరులు అంత యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటంలేదు. వీరిలో కొందరు పార్టీ మారిపోతారనే ప్రచారం కూడా జరుగుతోంది. సరే కారణాలు ఏవైనా ఇంత జంబో కార్యవర్గాన్ని నియమించటం చంద్రబాబుకే చెల్లింది.