Begin typing your search above and press return to search.

గోరేటి ఒక్కరే కన్ఫర్మ్.. మిగిలిన ఇద్దరు ఎవరు?

By:  Tupaki Desk   |   13 Nov 2020 10:30 AM IST
గోరేటి ఒక్కరే కన్ఫర్మ్.. మిగిలిన ఇద్దరు ఎవరు?
X
చేతిలో ఉన్న నామినేట్ పదవుల్ని కేటాయించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంతులేని జాప్యాన్ని ప్రదర్శిస్తుంటారు. పవర్ లేనప్పుడు పదవుల్ని ఇవ్వలేని అధినేతలు.. తాము పవర్ లో ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువమందికి పదవుల్ని ఇవ్వాల్సి ఉన్నా.. అందుకు భిన్నమైన ధోరణి గులాబీ బాస్ లో కనిపిస్తుంటుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాల్ని ఎంపిక చేయాల్సి ఉంది.

ఈ ఆగస్టుకు మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరిలో దివంగత నేత నాయిని.. రాములు నాయక్.. కర్నె ప్రభాకర్ లు ఉన్నారు. వీరిలో ఎవరికి సీటు దక్కుతుందన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఖాళీగా ఉన్న మూడింటికి సిట్టింగులు ఇద్దరితో పాటు.. పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మూడింటిలో గోరేటి వెంకన్నకు ఒక స్థానాన్ని కేటాయించినట్లుగా చెబుతున్నారు. దీనిపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.

మరోవైపు మాజీ ప్రధాని పీవీ కుమార్తె పీవీ వాణిదేవికి ఒక ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలన్న యోచనలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే.. ఈ విషయంపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో పీవీని భారీగా ప్రమోట్ చేస్తున్న వేళ.. ఆమెను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

అదే జరిగితే.. మూడో సీటు కోసం భారీగా పోటీ నెలకొని ఉంటుంది. ఇప్పటివరకు ఎవరికి అవకాశం ఇవ్వాలన్న విషయంపై ఎలాంటి చర్చను తీసుకురాని కేసీఆర్.. ముగ్గురిలో ఎంపికైన గోరేటి వెంకన్నను మినహాయిస్తే.. మిగిలిన రెండు స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశంపై మాత్రం క్లారిటీ రావటం లేదని చెప్పక తప్పదు. పదవులు ఎవరికి ఇచ్చినా సరే.. వీలైనంత త్వరగా ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.