Begin typing your search above and press return to search.

ఉద్యమకారులకే కేసీఆర్ అవకాశం.. ఎమ్మెల్సీగా గోరటి వెంకన్న..?

By:  Tupaki Desk   |   16 Sept 2020 2:00 PM IST
ఉద్యమకారులకే కేసీఆర్ అవకాశం.. ఎమ్మెల్సీగా గోరటి వెంకన్న..?
X
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయనను గవర్నర్‌‌ కోటాలో శాసనమండలికి పంపేందుకు కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. గవర్నర్‌‌ కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఒకదానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వెంకన్న పేరును టీఆర్‌‌ఎస్‌ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇటీవల వెంకన్న సీఎం కేసీఆర్‌‌ ను ప్రగతి భవన్‌ లో అందుకే కలిశారంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ పదవులు ఇవ్వడం లేదన్న అపవాదును చెరిపేసేందుకే గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ ఇస్తున్నారని.. ఇక నుంచి ఉద్యమకారులకే పట్టం కట్టబోతున్నట్టు దీని ద్వారా కేసీఆర్ సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రగతి భవన్‌లో సీఎం ఆధ్వర్యంలో జరిగిన ఒకటి, రెండు సమావేశాల్లోనే వెంకన్న పాల్గొన్నారు. ఇప్పుడు గవర్నర్‌‌ కోటా ఎమ్మెల్సీ కోసం వెంకన్న పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం గవర్నర్‌ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి (సభావత్‌ రాములు నాయక్‌) మార్చి 2న ఖాళీ కాగా, మరొకటి (నాయిని నర్సింహారెడ్డి) జూన్‌ 19న, ఇంకొకటి (కర్నె ప్రభాకర్‌) ఆగస్టు 17న ఖాళీ అయింది.

వీటిలో ఒకటి కర్నె ప్రభాకర్‌కు పక్కా అనే అభిప్రాయంతో పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. చివరి నిమిషంలో సమీకరణాలు మారితే తప్ప, సీనియర్‌ నేత నాయినిని నిరాశపర్చకపోవచ్చని చెబుతున్నారు. ఇక, మూడో స్థానం కోసం మొదటి నుంచీ మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ మూడు ఖాళీ స్థానాలు ఎవరికి దక్కుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మారింది.

తన మాటలు, పాటలు, రాతలతో ఆది నుంచీ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు గోరటి వెంకన్న. అంతకుముందు ఆయన రాసిన ‘పల్లె కన్నీరు పెడుతోందో’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ఆర్ పాదయాత్రలో ఈ పాట ఎంతో పాపులర్ అయ్యింది. రాష్ట్రం వచ్చి కేసీఆర్‌‌ ప్రభుత్వం రెండుసార్లు అధికారం లో చేపట్టినా ఆయన ఏనాడూ పదవులు ఆశించలేదు. అలా అనీ ఏనాడూ కేసీఆర్‌‌ మీద కానీ, ఆయన ప్రభుత్వం మీద కానీ విమర్శలు చేయలేదు.అందుకే కేసీఆర్ గోరటికి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.