Begin typing your search above and press return to search.

బీజేపీ అధికారంలోకి.. మళ్లీ ‘గాలి’ తెరపైకి..

By:  Tupaki Desk   |   27 July 2019 7:00 AM IST
బీజేపీ అధికారంలోకి.. మళ్లీ ‘గాలి’ తెరపైకి..
X
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తోంది. యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పుడు మళ్లీ ‘గాలి’ వీయడానికి రంగం సిద్ధమైందట.. బీజేపీని నిలబెట్టడానికి ఆర్థిక అండదండలు అందించిన ‘గాలి’ని యడ్యూరప్ప మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తేబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.

గాలి జనార్ధన్ రెడ్డి.. మైనింగ్ కింగ్.. బీజేపీ నేత. ఒకప్పుడు కర్ణాటక పాలిటిక్స్ ను ఏలిన నేత. యడ్యూరప్ప సహా బీజేపీకి ఆర్థికంగా అండగా ఉండి ప్రభుత్వాలను నిలబెట్టిన మైనింగ్ డాన్ గా పేరుంది. చాలా మంది ఎమ్మెల్యేలను సపోర్టుగా నిలిపి అప్పట్లో యడ్యూరప్పను సీఎంగా నిలబెట్టడంలో గాలి కీలకంగా పనిచేశారు.

అయితే వైఎస్ హయాంలో గాలిపై మైనింగ్ కేసులు నమోదై ఆయన 1000 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఐటీ దాడులతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం బెయిల్ పై వచ్చారు. ఇప్పుడు కన్నడలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో గాలి కష్టాలు తీరబోతున్నాయట.. తనకు ఎంతో నమ్మకస్తుడైన సీఎం యడ్యూరప్ప ద్వారా కేంద్రంలో తనపై ఉన్న కేసులను తొలగించుకొని మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ కావాలని గాలి స్కెచ్ గీస్తున్నాడట..

గాలి జనార్ధన్ రెడ్డికి ప్రస్తుత సీఎం యడ్యూరప్ప చాలా దగ్గరి స్నేహితుడు. క్లిష్ట సమయంలో గాలి సాయం తీసుకొని యడ్యూరప్ప రాజకీయం నడిపారు. అందుకే ప్రభుత్వం ఏర్పడగానే గాలిపై ఉన్న కేసులను తొలగింప చేసి ఆయన వర్గాన్ని పైకి తేవడం.. మళ్లీ బళ్లారిలో గాలిని బలంగా చేసేందుకు పావులు కదుపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. అవసరమైతే గాలి సన్నిహితులైన బళ్లారి ఎమ్మెల్యేలకు మంత్రి పదవిలో చోటు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.. సో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం గాలికి వరంగా మారిందని కన్నడ పాలిటిక్స్ లో చర్చ సాగుతోంది.