Begin typing your search above and press return to search.

‘దిశ యాప్’.. మ‌హిళ‌ల దశ మారుస్తుందా?

By:  Tupaki Desk   |   25 Jun 2021 2:30 AM GMT
‘దిశ యాప్’.. మ‌హిళ‌ల దశ మారుస్తుందా?
X
అమ్మాయిల‌పై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చ‌ట్టాలు రూపొందించినా.. ఈ దారుణాల‌కు అంతులేకుండా పోతోంది. ఉన్మాదులు అత్యాచారాలకు పాల్ప‌డుతూనే ఉన్నారు. ఈ అఘాయిత్యాల‌ను అడ్డుకునేందుకు ఏపీ స‌ర్కారు హైద‌రాబాద్ లో 'దిశ‌' ఉదంతం నేపథ్యంలో కీలక చట్టం చేసింది. ఈ 'దిశ చట్టం' ద్వారా నేరం జరిగిన 14 రోజుల్లో విచారణ పూర్తిచేసి, 21 రోజుల్లో దోషికి శిక్ష విధించేలా శాసనం చేసింది.

ఇప్పుడు.. దారుణం జరగడానికి ముందే జాగ్రత్తలు తీసుకునే చర్యలు చేపట్టింది ఏపీ స‌ర్కారు. ఇందుకోసం 'దిశ‌' యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ను ప్ర‌తీ ఇంటికి తీసుకెళ్లాల‌ని, యువ‌తులు, మ‌హిళ‌లు అంద‌రూ డౌన్ లోడ్ చేసుకునేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశించారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై బుధ‌వారం నిర్వ‌హించిన ఉన్న‌త స‌మీక్ష‌లో భాగంగా ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

''మహిళలందరూ ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలి. ఇందుకోసం గ్రామాల్లోని వార్డు మెంబర్లు, వలంటీర్లు, మహిళా పోలీసులు కృషి చేయాలి. ఈ యాప్ పై మ‌హిళ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి'' అని జ‌గ‌న్ సూచించారు. ఇంటింటికీ వెళ్లి, యాప్ డౌన్ లోడ్ చేయించి, ప్ర‌మాద స‌మ‌యంలో ఏ విధంగా ఇది ఉప‌యోగ ప‌డుతుంది? ఎలా ఆప‌రేట్ చేయాల‌నేది కూడా నేర్పించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

కాలేజీ విద్యార్థుల‌తోపాటు ఉద్యోగాలు చేసుకునే మ‌హిళ‌లకు ఈ యాప్ ఎంతో ర‌క్ష‌ణ‌గా ఉంటుంద‌ని చెప్పారు. ఈ యాప్ ద్వారా అలారం మోగుతుంద‌ని, ఇది మోగ‌గానే స‌మీపంలోని దిశ, స్థానిక స్టేష‌న్ల‌కు చెందిన పోలీసులు అప్ర‌మ‌త్తం అవుతార‌ని, బాధితుల‌కు స‌త్వ‌ర ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం అవసరమైన సంఖ్యలో పెట్రోలింగ్ వాహనాలను కూడా సిద్ధం చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

మొత్తానికి.. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యాప్ నిస్సందేహంగా మంచి ముంద‌డుగే. అయితే.. ప్ర‌మాదంలో ఉన్న బాధితుల ప‌ట్ల పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు? ఎంత త్వ‌ర‌గా రంగంలోకి దిగుతారు? అన్న‌ విష‌యం మీద‌నే అంతా ఆధార‌ప‌డి ఉంటుంద‌నే అభిప్రాయం వ్య‌క‌మ‌వుతోంది. 'దిశ‌' విషయంలో పోలీసులు సకాలంలో స్పందించలేదనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల‌ని, అప్పుడే ఈ యాప్ ల‌క్ష్యం నెర‌వేరుతుంద‌ని, మ‌రో ఆడ బిడ్డ బ‌లికాకుండా ఉంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది.