Begin typing your search above and press return to search.

కోమాలో నుండి కాంగ్రెస్ బయటకు వస్తుందా ?

By:  Tupaki Desk   |   11 Nov 2020 2:00 PM IST
కోమాలో నుండి కాంగ్రెస్ బయటకు వస్తుందా ?
X
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కోమాలో ఉన్న పేషంట్ లాగ తయారైపోయింది. బలంగా ఉన్న రాష్ట్రాన్ని చేజేతులా అధిష్టాన వర్గమే అడ్డుగోలో విభజనతో దెబ్బ తీసుకుంది. దాని ఫలితంగానే ఇపుడు పార్టీ కోమా స్టేజిలోకి వెళ్ళిపోయింది. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందా అనే అనుమానం వచ్చేస్తోంది జనాలకు. దీనికంతటికీ కారణం ఏమిటంటే బలమైన నేతల్లో చాలామంది ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు. మిగిలిన అరాకొర నేతలు పార్టీలో యాక్టివ్ గా లేరు. ఫలితంగా పార్టీ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైపోయింది.

డాక్టర్ సాకే శైలజానాద్ ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా సొంతజిల్లా అనంతరపురంలోనే ప్రభావం చూపలేని స్ధితిలో ఉన్నారు. ఎందుకంటే సాకే ముందు అధ్యక్షునిగా పనిచేసిన నీలకంఠాపురం రఘువీరారెడ్డి యాదవ్ కూడా అనంతపురం జిల్లానే. రఘువీరా హయాంలోనే పార్టీ దాదాపు నేలమట్టమైపోయింది. అలాంటిది ఇపుడు సాకే అధ్యక్షునిగా ఉంటే మాత్రం ఎలా పుంజుకుంటుంది ? అసలు పార్టీకి ఈ పరిస్ధితి రప్పించిన అధిష్టానందే తప్పని చెప్పాలి.

మెజారిటి జనాల మనోభావాలతో ఏమాత్రం సంబంధం లేకుండా రాష్ట్రాన్ని విభజించిన రోజే పార్టీ డౌన్ ఫాల్ కు కూడా ముహూర్తం ఫిక్సయిపోయింది. ఏకపక్షంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందనే మంట జనాల్లో 2014 ఎన్నికల్లోనే బయటపడింది. ఒక్కటంటే కనీసం ఒక్క నియోజకవర్గంలో కూడా పార్టీ గెలవలేదు. అప్పటి నుండి పార్టీని పట్టించుకునే దిక్కే లేదు. 2019 ఎన్నికల్లో అయితే అసలు పార్టీ తరపున పోటి చేయటానికే నేతలు ముందుకు రాలేదు చాలా చోట్ల. అంటే ఈ మధ్యలోని ఐదేళ్ళల్లో పార్టీలోని బలమైన నేతలంతా ఏదో ఓ పార్టీలో సర్దేసుకున్నారు.

వైసీపీలో చేరటానికి అవకాశం రాని నేతలు, టీడీపీలోకి వెళ్ళటం ఇష్టంలేని నేతలు మాత్రమే కాంగ్రెస్ లో ఉండిపోయారు. దాంతో వాళ్ళు ఉనికి కూడా కోల్పోయారనే చెప్పాలి. రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా పార్టీ తరపున గొంతు వినిపించే నేతలే కరువయ్యారు. మామూలుగా రాయలసీమ జిల్లాల్లో బలంగా ఉండే నేతలు ఇపుడు ఒక్కరు కూడా కనబడటం లేదు. ఇక ఉభయగోదావరి జిల్లాల్లోని నేతల విషయం చెప్పాల్సిన పనేలేదు. ఎక్కడికక్కడ నేతలు పార్టీని వదిలేయటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయటం పక్కన పెడితే కనీసం గట్టిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉండటం లేదు. ఈ పరిస్ధితుల్లో అధ్యక్షునిగా సాకే కాదు కదా ఎవరున్నా ఒకటే అన్నట్లుగా తయారైపోయింది. మరి పార్టీ కోమాలో నుండి ఎప్పుడు వస్తుందో ? అసలు వస్తుందో లేదో కూడా తెలీటం లేదు.