Begin typing your search above and press return to search.

కరోనా మృతులు 4 ల‌క్ష‌లు.. ప‌రిహారం అంద‌రికీ ఇస్తారా?

By:  Tupaki Desk   |   3 July 2021 8:00 AM IST
కరోనా మృతులు 4 ల‌క్ష‌లు.. ప‌రిహారం అంద‌రికీ ఇస్తారా?
X
క‌రోనా మ‌హ‌మ్మారి మ‌న దేశంపై ఏ స్థాయిలో ప్ర‌భావం చూపిందో వ‌ర్ణించ‌డం క‌ష్టం. యావ‌త్ దేశం చిగురుటాకులా వణికిపోయింది. గ‌రిష్టంగా ఒక్క రోజుకు 4 ల‌క్ష‌ల పైచిలుకు కేసులు న‌మోదు కాగా.. నాలుగు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా విడుద‌లైన అధికారిక లెక్క‌ల ప్ర‌కారం.. దేశంలో క‌రోనా కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 4 ల‌క్ష‌లు దాటిపోయింది. ప‌క్కాగా చెప్పాలంటే.. ఇప్పటి వరకు 4 ల‌క్ష‌ల 312 మందిని కొవిడ్ బ‌లితీసుకున్న‌ది.

అయితే.. కరోనా కారణంగా చనిపోయిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాల‌ని సుప్రీం కోర్టు ఆదేశించింది. డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ శాఖ ఈ బాధ్య‌త‌లు చూడాల‌ని చెప్పింది. క‌రోనా మృతుల‌కు ప‌రిహారం 4 ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లించాల‌ని గ‌తంలో సుప్రీంలో ఓ వ్యాజ్యం దాఖ‌లైంది. అయితే.. అన్ని నిధులు త‌మ వ‌ద్ద లేవ‌ని అప్పుడు కేంద్రం చేతులెత్తేసింది. తాజాగా ఈ కేసును విచారించిన ధ‌ర్మాస‌నం.. బాధితుల‌కు త‌ప్ప‌నిస‌రిగా ప‌రిహారం అందించాల‌ని ఆదేశించింది. అయితే.. ప‌రిహారం ఎంత చెల్లించాల‌నేది మాత్రం కేంద్ర ప్ర‌భుత్వం ఇష్ట‌మ‌ని చెప్పింది.

దీంతో.. కేంద్ర ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. నిజానికి.. క‌రోనా కార‌ణంగా బాధితులు ఎంతగా చితికిపోయారో అంద‌రికీ తెలిసిందే. ఒక్క రోజు ట్రీట్మెంట్ కు క‌నీసంగా 50 వేల పైనుంచి ల‌క్ష‌లు కూడా వ‌సూలు చేసిన ఆసుప‌త్రులు ఉన్నాయి. పైస‌లా? ప్రాణమా? అంటే ఎవ్వ‌రైనా ప్రాణ‌మే అని అంటారు. ఆ విధంగా.. కొంద‌రు ఆస్తులు అమ్ముకోగా.. మ‌రికొంద‌రు అప్పులు తెచ్చి ఖ‌ర్చు చేశారు. ఇంతా చేసినా.. త‌మ‌వారిని ద‌క్కించుకోలేని వారు కూడా ఎంద‌రో ఉన్నారు. ఇలాంటి వారు రెండు విధాలుగా న‌ష్ట‌పోయారు.

కాబ‌ట్టి.. వారిని ఆదుకోవాల్సిందేన‌ని సుప్రీం ఆదేశించింది. అయితే.. ఇక్క‌డ రెండు ప్ర‌ధానాంశాలు ఉన్నాయి. ల‌క్ష‌లాది రూపాయ‌లు ఖర్చు చేసుకున్న బాధితుల‌కు కేంద్రం ఇచ్చేది ఎంత‌? అన్న‌ది ఒక‌టైతే.. అంద‌రికీ ప‌రిహారం అందుతుందా? అన్న‌ది మ‌రొక సందేహం. దీనికి కార‌ణం లేక‌పోలేదు. క‌రోనా మృతులు ల‌క్ష‌లాదిగా పెరుగుతున్న వేళ‌.. ఉద్దేశ‌పూర్వ‌కంగానే మ‌ర‌ణాల సంఖ్య‌ను త‌గ్గించి చూపిన‌ట్టు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప్ర‌భుత్వాలు త‌మ చేత‌గాని త‌న‌నాన్ని.. ఇలా క‌ప్పి పుచ్చుకుంటున్నాయ‌ని ఎంతో మంది ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

మ‌రి, ప‌రిహారం చెల్లింపు అనేది డ‌బ్బుతో ముడిప‌డిన అంశం. అధికారంగా మ‌ర‌ణించార‌ని చూపించిన ఈ నాలుగు ల‌క్ష‌ల మంది కుటుంబాల‌కైనా ప‌రిహారం చెల్లిస్తారా? కుంటి సాకులతో మొండి చేయి చూపిస్తారా? అనే భ‌యం కూడా ఉంది. కరోనా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌మయ్యాయ‌నే అప‌వాదును మూట‌గ‌ట్టుకున్న ప్ర‌భుత్వాలు.. క‌నీసం ప‌రిహారం చెల్లింపులోనైనా నిజాయితీగా బాధితుల‌ను ఆదుకోవ‌డం ద్వారా చిత్త‌శుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంది.