Begin typing your search above and press return to search.

బీజేపీతో చెలిమి కోసం.. బాబు సాహ‌సం.. ఫ‌లించేనా..?

By:  Tupaki Desk   |   28 July 2021 4:30 PM GMT
బీజేపీతో చెలిమి కోసం.. బాబు సాహ‌సం.. ఫ‌లించేనా..?
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో తెర‌వెనుక వ్యూహాలు ర‌చిస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న ముందున్న రెండు వ్యూహాల‌పై దృష్టి పెట్టారు. ఒక‌టి.. పాత మిత్రుడు బీజేపీతో చేతులు క‌ల‌పడం. రెండు.. కాంగ్రెస్‌తో చెలిమి చేసుకోవ‌డం.

అయితే.. ఈ రెండు విష‌యాల్లో టీడీపీ నాయ‌క‌త్వం మేజ‌ర్ పార్టుగా బీజేపీ వైపు మొగ్గు చూపుతోంది. కాంగ్రెస్‌తో చేతులు క‌లిపినా.. 2018లో తెలంగాణ‌లో ఎద‌రైన అనుభ‌వ‌మే ఎదురు కావ‌చ్చ‌ని..పైగా ఏపీ ఫార్ములా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని.. టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌ను ప‌క్క‌న పెట్టి బీజేపీ వైపు మొగ్గు చూపేందుకే బాబు ఎక్కువ మొగ్గు చూపుతున్నార‌ట‌.

అయితే.. బీజేపీలో చంద్ర‌బాబుకు మైన‌స్ మార్కులు ఉన్నాయి. 2014లో బీజేపీతో చేతులు క‌లిపిన ఆయ‌న అధికారం అందిపు చ్చుకున్నారు. అయితే.. 2018 నాటికి ఆ చెలిమి కాస్తా.. దెబ్బ‌తిని కేంద్రంలోని న‌రేంద్ర మోడీని అధికారం నుంచి దింపే వ‌ర‌కు నిద్ర‌పోనంటూ చంద్ర‌బాబు భీష‌ణ ప్ర‌తిజ్ఞ‌లు చేశారు. పైగా ఆయ‌న్ను ఓడించాల‌ని దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో తిరిగి మ‌రీ ప్ర‌చారంం చేశారు.

ఇదే ఇప్పుడు ఆయ‌న‌కు పెద్ద మైన‌స్‌గా మారిపోయింంది. ఏపీలో బీజేపీ నేత‌లు.. చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త పెద్ద‌గా వ్య‌క్తం చేయ‌డం లేదు. ఎందుకంటే.. బాబుతో క‌లిసిన‌ప్పుడు. 2014లో నాలుగు అసెంబ్లీ ఒక పార్ల‌మెంటు స్థానంలో బీజేపీ విజ‌యంద‌క్కించుకుంది.

ఇదే ఫార్ములాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాడుకుంటే.. ఎలాగూ.. జ‌న‌సేన కూడా తోడుగా ఉంది క‌నుక‌.. ఖ‌చ్చితంగా నాలుగు నుంచి ఐదు స్థానాలు కొట్టేయొచ్చ‌ని.. కొంద‌రు నేత‌లు భావిస్తున్నారు. పైగా బాబుతో క‌లిసి ఉంటే ఏపీలో ఎద‌గ‌లేం అన్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

పైగా బాబు చెప్పిన‌ట్టు వినాలి.. అదే జ‌న‌సేన‌తో ఉంటే ప‌వ‌న్ బీజేపీ చెప్పిన‌ట్టే ఎంచ‌క్కా వింటారు... బీజేపీ ఇచ్చిన సీట్లే తీసుకుంటారు. ఇక ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. వంటి ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. మిగిలిన వారు బాబుకు సానుకూలంగానే ఉన్న‌ప్ప టికీ... మోడీని దింపేస్తాను.. అంటూ.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు మాత్రం ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక పోతున్నారు.

దీంతో బాబు త‌ప్ప‌.. అనే ధోర‌ణిలో వారు ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు త‌న ప్ర‌య‌త్నాలు మాత్రం మానుకోవ‌డం లేదు. బీజేపీ మాతృసంస్థ ఆర్ ఎస్ ఎస్‌తో చంద్ర‌బాబుకు లోపాయికారీ సంబంధం ఉంది. బాబు పాల‌న‌ను ఆర్ ఎస్ ఎస్ త‌ర‌చుగా పొగుడుతూనే ఉంది. ఆయ‌న అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఏపీ వంటి రాష్ట్రాన్ని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని.. మోహ‌న్ భ‌గ‌వ‌త్ వంటివారు పిలుపునిచ్చేవారు.

ఇక‌, ఇప్పుడు కూడా ఆర్ ఎస్ ఎస్‌కు టీడీపీపై సానుకూలత ఉంది. అదే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌పైనా, వైసీపీపైనా..ఆర్ ఎస్ ఎస్‌కు తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌త మార్పిడులు ప్రోత్స‌హిస్తున్నార‌ని.. హిందూ ఆల‌యాల‌పై దాడులు చేస్తున్నా.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉన్నార‌ని.. అస‌లు జ‌గ‌న్ హిందువే కాద‌ని.. ఇలా ఆర్ ఎస్ ఎస్ నాయ‌క‌త్వం విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే.

సో.. ఈ నేప‌థ్యంలో ఆర్ ఎస్ ఎస్‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం ద్వారా.. బీజేపీతో తిరిగి పొత్తు పెట్టుకునేందుకు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ ప్ర‌య‌త్నాలు మేర‌కు ఫిలిస్తాయో చూడాలి. గ‌తంలో అంటే.. ఆర్ ఎస్ ఎస్ ఏం చెప్పినా.. బీజేపీ చేసేది. కానీ, ఇప్పుడు మోడీ, షాల మాటే కీల‌కం.

మ‌రి వీరి మాట‌ను కూడా కాద‌ని.. ఆర్ ఎస్ ఎస్ చంద్ర‌బాబు ను నెత్తిన పెట్టుకుంటే.. బీజేపీ త‌ప్ప‌కుండా చెలిమి చేస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బాబు కూడా ఇదే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.