Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఖాళీ చేయాల్సిందేనా ?

By:  Tupaki Desk   |   15 Sep 2022 6:16 AM GMT
చంద్రబాబు ఖాళీ చేయాల్సిందేనా ?
X
ఆక్రమణదారులను ఖాళీ చేయించేందుకు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు మాసాలు గడువిచ్చింది. రెవిన్యు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, అటవీ శాఖలకు చెందిన భూములను ఆక్రమించి నిర్మించుకున్న నిర్మాణాలను తొలగించేందుకు ప్రభుత్వానికి హైకోర్టు ఆరు నెలలు మాత్రమే గడువిచ్చింది.

కృష్ణా నది కరకట్టపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా తొలగించాల్సిందే అని హైకోర్టు ప్రత్యేకంగా ఆదేశాలిచ్చింది. ఆక్రమణలు ఏరూపంలో ఉన్నా గుర్తించాల్సిందే, వాటిని వెంటనే తొలగించాల్సిందే అని బుధవారం స్పష్టంగా ఆదేశించింది.

చట్ట నిబంధనల ప్రకారం ఆక్రమణదారులకు ముందుగా నోటీసులిచ్చి వారి వాదనలు వినాలని చెప్పింది. పంచాయితీ భూముల్లో ఆక్రమణల తొలగింపుకు 6 నెలలు, మున్సిపల్, అటవీ, రెవిన్యు శాఖల్లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు 2 మాసాలు గడువును కోర్టు విధించింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఆక్రమణలు తొలగించేముందు వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళ వాదనలు వినాలని చెప్పటమే.

ఇక్కడ సమస్య ఏమిటంటే చేసింది అక్రమ నిర్మాణాలు. ఆ విషయం ఆక్రమణదారులకు బాగా తెలుసు. కబ్జాచేసి నిర్మించుకున్న అక్రమ నిర్మాణాల విలువ ఇపుడు కోట్ల రూపాయల్లో ఉంటుంది. మరలాంటపుడు వాళ్ళకు నోటీసులిచ్చి, వాదనలు విన్న తర్వాత ఆక్రమణలను తొలగించాలని కోర్టు ఎందుకు చెప్పింది ?

వాళ్ళ వాదనలు వినాలని నోటీసులు ఇస్తేనే కదా కరకట్టమీద ఆక్రమణదారులు కోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకున్నది ? అక్రమ నిర్మాణాలు తొలగించమని ఇపుడు చెప్పిన హైకోర్టు గతంలో ప్రభుత్వం ఇదే పనిచేద్దామని ప్రయత్నించినపుడు స్టే ఎందుకిచ్చినట్లు ?

ఇపుడు నోటీసులిచ్చి వాళ్ళ వాదనలు వినాలంటే మళ్ళీ కబ్జాదారులంతా కోర్టునే ఆశ్రయిస్తారు. సరే ఈ గొడవలు ఎలాగున్నా కరకట్ట అక్రమ నిర్మాణంలో ఉంటున్నా చంద్రబాబునాయుడు దాన్ని ఖాళీ చేస్తారా ? చంద్రబాబు ఉంటున్న భవనం నూరుశాతం అక్రమ నిర్మాణమే అని గతంలో టీడీపీ ప్రభుత్వమే తేల్చింది. ఇలాంటి అక్రమనిర్మాణాలు కరకట్టపైన ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చాలావరకు ప్రముఖుల కబ్జాలోనే ఉన్నాయి. మరి వీటి కూల్చివేతల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.