Begin typing your search above and press return to search.

సీఎం జగన్ కి సిబిఐ కోర్టు స్పెషల్ పర్మిషన్ ఇస్తుందా ... ?

By:  Tupaki Desk   |   18 Oct 2019 1:04 PM IST
సీఎం జగన్ కి సిబిఐ కోర్టు స్పెషల్ పర్మిషన్ ఇస్తుందా ... ?
X
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ..అధికారంలోకి వచ్చిందే తడువు ఏపీ అభివృద్దే ద్యేయంగా ముందుకుసాగిపోతున్నారు. క్షణం కూడా తీరిక లేకుండా ప్రజా సమస్యలపై సమీక్షలు జరుపుతూ మంచి సీఎం గా పేరుతెచ్చుకుంటున్నాడు. ఇకపోతే జగన్ అవినీతి అక్రమ సంపాదనల కేసులో ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకి హాజరుకావాలి.

ప్రతిపక్షనాయకుడిగా ఉన్నంత కాలం కోర్టుకి హాజరౌతూనే వచ్చారు. కానీ , ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత ... తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైనందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరుతూ జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సమాధానం ఇవ్వాలని సీబీఐకి స్పెషల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ వేసిన ఈ పిటిషన్ పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరుగనుంది.

ఇక తాజాగా జగన్ వేసిన పిటిషన్ కి కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ, ఈ కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్ అని, ఆయన ప్రస్తుతం సీఎంగా ఉన్నందున, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇస్తే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో అయన ఎంపీగా ఉన్నప్పుడే సాక్షాలని ప్రభావితం చేసారు అని , ఇప్పుడు అయన సీఎం అని చెప్పుకొచ్చింది.అసలు వారానికోసారి కోర్టుకు హాజరయ్యేందుకు ఇబ్బందులు ఏముంటాయని ప్రశ్నించింది.

కాగా, సీబీఐ కౌంటర్ పిటిషన్ పై నేడు వాదోపవాదాలు జరగనున్నాయి. ఆ తరువాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగన్ వ్యక్తిగత హాజరుపై తీర్పుని వెల్లడించనున్నారు. ఇకపోతే గతంలో ముఖ్యమంత్రులపై కోర్టు కేసుల తీరును పరిశీలిస్తే, వ్యక్తిగత హాజరు నుంచి సీఎం జగన్ మినహాయింపు లభించే అవకాశం ఉంది అని న్యాయ శాఖ నిపుణులు తెలుపుతున్నారు.