Begin typing your search above and press return to search.

ఇక పై ఈ సిగరెట్లు అమ్మితే జైలుకే ..?

By:  Tupaki Desk   |   3 Dec 2019 8:47 AM GMT
ఇక పై ఈ సిగరెట్లు అమ్మితే జైలుకే ..?
X
దేశంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం విధించేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు సోమవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ-సిగరెట్ల ఉత్పత్తి, వ్యాపారం, రవాణా, నిల్వ, వాణిజ్య ప్రకటనలను నిషేధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ బిల్లుని గతంలోనే లోక్‌సభ ఆమోదించింది. తాజాగా రాజ్యసభ ఈ బిల్లుకి ఆమోదం తెలిపింది. సెప్టెంబరులో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో దీనిని ప్రభుత్వం ప్రతిపాదించింది.

దీనితో ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ బిల్లు ప్రకారం ..ఇకపై ఈ-సిగరెట్లను నిల్వ ఉంచినవారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.50 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలు విధించే అవకాశం కనిపిస్తుంది. నిబంధనలను మొదటిసారి ఉల్లంఘించినవారిని రూ.1 లక్ష జరిమానాతో లేదా ఒక ఏడాది జైలు శిక్షతో లేదా ఈ రెండు శిక్షలతో శిక్షించవచ్చునని ఈ బిల్లు చెప్తోంది. రెండోసారి ఇదే నేరానికి పాల్పడితే గరిష్ఠంగా రూ.5 లక్షలు జరిమానాతోపాటు మూడేళ్ళ వరకు జైలు శిక్ష విధించవచ్చు.

ఈ బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంట్ లో పలువురు సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ మాట్లాడుతూ ... తాము గొప్ప సదుద్దేశంతో ఈ బిల్లును ప్రతిపాదించామని ,ఇందులో తమకు స్వార్థ ప్రయోజనాలేవీ లేవు అని తేల్చి చెప్పారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కొందరు సభ్యులు మాట్లాడుతూ పొగాకు లాబీ ఒత్తిళ్ళ కారణంగానే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందనే అనుమానం వ్యక్తం చేశారు. ముడి పొగాకు, సంప్రదాయ సిగరెట్లకు కూడా నిషేధాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.