Begin typing your search above and press return to search.

వైసీపీలో ఎంపీ ప‌ద‌వులను బీజేపీ డిసైడ్ చేస్తుందా?

By:  Tupaki Desk   |   3 Feb 2022 12:30 PM GMT
వైసీపీలో ఎంపీ ప‌ద‌వులను బీజేపీ డిసైడ్ చేస్తుందా?
X
తెలుగు రాష్ట్రాల్లో ఇక రాజ్య‌స‌భ స‌భ్యుల భ‌ర్తీ సంద‌డి మొద‌లు కానుంది. ఈ ఏడాది జూన్‌లో దేశ‌వ్యాప్తంగా కొన్న రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో భాగంగా ఏపీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో ఈ స్థానాల భ‌ర్తీ కోసం వ‌చ్చే నెల చివ‌ర్లో నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఏపీలో అధికార వైసీపీకి పూర్తి బ‌లం ఉంది కాబట్టి ఈ నాలుగు స్థానాలు ఆ పార్టీకే ద‌క్కుతాయ‌న‌డంలో సందేహం లేదు. దీంతో జ‌గ‌న్ ఎవ‌రిని రాజ్య‌స‌భ‌కు పంపుతారోనన్న ఆస‌క్తి క‌లుగుతోంది.

ఆ నలుగురిలో ఒక‌రైన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిని జ‌గ‌న్ కొన‌సాగించే అవ‌కాశం ఉంది. ఇక మిగిలిన మూడు స్థానాల‌పై సందిగ్ధ‌త నెల‌కొంది. సాధార‌ణంగా అయితే ఈ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను జ‌గ‌న్ నిర్ణ‌యించాలి. కానీ ఈ రాజ్య‌స‌భ చోటు కోసం కొంత‌మంది నేత‌లు ఢిల్లీలో బీజేపీ ద‌గ్గ‌ర లాబీయింగ్ చేస్తున్నార‌ని స‌మాచారం. త‌మ‌కు ఏపీ నుంచి రాజ్య‌స‌భ సీటు ఇప్పించాల‌ని బీజేపీ అధిష్ఠానాన్ని కోరుతున్నార‌ని తెలిసింది.

ఢిల్లీలోని బీజేపీ పెద్ద‌ల‌ను క‌లుస్తున్న వీళ్లు జ‌గ‌న్‌తో చెప్పి రాజ్య‌స‌భ ఎంపీ సీటు ద‌క్కేలా చేయాల‌ని కోరుతున్నారంటా. దీంతో వైసీపీని న‌డిపిస్తోంది బీజేపీనా అనే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి.

ఇప్ప‌టికే ఏపీకి కేంద్రం ఎన్ని ర‌కాలుగా అన్యాయం చేసినా సీఎం జ‌గ‌న్ ఒక్క మాట కూడా మాట్లాడ‌డం లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీ ప్ర‌స్తావ‌నే లేక‌పోయినా జ‌గ‌న్ అస‌లు స్పందించ‌నే లేద‌ని ప్ర‌ధాని మోడీకి ఆయ‌న భ‌య‌ప‌డుతున్నార‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. కేసుల‌కు భ‌య‌ప‌డే జ‌గ‌న్ నోరు మొద‌ప‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అలాంటిది ఇప్పుడు రాజ్య‌స‌భ సీట్ల విష‌యంలోనూ ప‌ద‌వి ఆశిస్తున్న వాళ్లు నేరుగా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు రాకుండా.. బీజేపీ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం అనేక సందేహాల‌కు తావిస్తోంది.

వైసీపీలో ఎంపీ ప‌ద‌వుల‌ను బీజేపీనే డిసైడ్ చేస్తుందా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. మ‌రి దీనికి జ‌గ‌న్ కానీ వైసీపీ నేత‌లు కానీ ఎలాంటి స‌మాధానం చెబుతారో చూడాలి.