Begin typing your search above and press return to search.

బెజవాడ సీన్ హైదరాబాద్ లో రిపీట్ కానుందా?

By:  Tupaki Desk   |   8 Feb 2022 5:30 AM GMT
బెజవాడ సీన్ హైదరాబాద్ లో రిపీట్ కానుందా?
X
ఏపీలో తిరుగులేని అధికారంతో సాగుతున్న జగన్మోహన్ రెడ్డి సర్కారుకు దిమ్మ తిరిగే షాకిచ్చిన క్రెడిట్ ప్రభుత్వ ఉద్యోగులు.. ఉపాధ్యాయులకే దక్కుతుంది. పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావటం తెలిసిందే. అయినప్పటికి ఏపీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా పెద్ద తప్పునే చేసింది.

సర్కారు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు.. ఉపాధ్యాయులు నిరసన ర్యాలీని విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించటం.. గత వారం చోటు చేసుకున్న ర్యాలీ దేశ ఉద్యమ చరిత్రలో నిలిచిపోయేలా చేయటం తెలిసిందే. దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులు.. ఉపాధ్యాయులు బెజవాడ రోడ్ల మీద కదం తొక్కిన వైనం జగన్ సర్కారుకు నోట మాట రాకుండా చేసింది.

పోలీసుల సాయంతో ఆందోళన కారుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసినప్పటికీ.. అనూహ్యంగా బెజవాడకు చేరుకున్న లక్షలాది మంది ఉద్యోగ.. ఉపాధ్యాయులు జగన్ సర్కారుకు షాకిచ్చారు. ఇప్పుడు అలాంటి సీన్ హైదరాబాద్ లో కూడా రిపీట్ కానుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు వ్యతిరేకంగా బుధవారం (ఫిబ్రవరి 9న) హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రకటించింది.

ఈ నిరసన ధర్నాకు ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున వస్తున్నట్లు చెబుతున్నారు. జీవో సవరణలు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని.. ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని వారు చెబుతున్నారు. టీచర్ల మనోగతానికి విరుద్దంగా ప్రభుత్వం బలవంతపు బదిలీలు చేసినట్లుగా ఆరోపించారు. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వకుంటే భవిష్యత్తులో నాన్ లోకల్స్ గో బ్యాక్ నినాదం బలపడే వీలుందని చెప్పారు. బెజవాడలో మాదిరి సీన్ హైదరాబాద్ లో రిపీట్ అవుతుందా? అంటే.. అలాంటి అవకాశం లేదంటున్నారు.

ఏపీలో జీతాల సమస్య కావటం.. ప్రతి ఒక్కరూ బాధితులుగా మారటంతోపాటు.. నెలవారీగా నష్టపోతామన్న బాధ అందరిని ఏకం చేసింది. కానీ.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ ఉందని.. అందుకే అక్కడ నిరసన భారీ స్థాయిలో ఉండే అవకాశం లేదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.