Begin typing your search above and press return to search.

కేసీయార్ నోటి వెంట ఆ మాట ఆంధ్రులు వింటారా...?

By:  Tupaki Desk   |   21 Jan 2023 11:48 AM GMT
కేసీయార్ నోటి వెంట ఆ మాట ఆంధ్రులు వింటారా...?
X
కేసీయార్ రాజకీయంగా ఢక్కా మెక్కీలు తిన్న వారు. ఆయన వ్యూహాలకు పదును ఎక్కువ. సాధారణంగానే రాజకీయ నాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పడతారు గతం గతహా అని అనేస్తారు. ఇపుడు కేసీయార్ తీరు కూడా అలాగే ఉంది అంటున్నారు. ఆయన ఆంధ్రులను పట్టుకుని లంకలో పుట్టిన వారు అంతా అదే జాతి వారు అని కెలికి వదిలిపెట్టారు ఆంధ్రులు మోసగాళ్ళు, వంచనలో ఆరితేరిన వారు అంటూ నానా మాటలు అన్నారు.

నిజానికి ఆరు దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీకి హైదరాబాద్ రాజధానిగా ఉన్నా కూడా ఏపీ నుంచి తమ జీవితకాలంలో హైదరాబాద్ ముఖం చూడని వారు కోట్లలోనే ఉన్నారు. వారికి రాజధానితో పని లేదు. తమ బతుకు ఏదో తాము బతుకుతూ ఉన్న చోటనే గిరిగీసుకుని ఉన్నారు. ఇక హైదరాబాద్ కి చాలా మంది ఆంధ్రా ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారే అనుకున్నా వారు ఎవరూ తెలంగాణాను దోచుకోలేదు, కోలేరు కూడా.

వారు బతుకు తెరువు కోసమో వ్యాపారం కోసమో ఉపాధి కోసమో వచ్చిన వారు, విద్య కోసం వచ్చిన వారు అయి ఉన్నారు. కానీ ఇలా కోట్లలో ఉన్న సాధారణ ప్రజలను పట్టుకుని కేసీయార్ దారుణమైన మాటలు అన్నారు. ఆయన ఉద్యమ వేడిని రగిలించాలని చెప్పి ఆంధ్రుల మీద తన పాండిత్యాన్ని పెద్ద ఎత్తున చూపించారు. ఆయన అనుకున్న లక్ష్యం సాధించారు. తెలంగాణా ఏర్పడింది.

రెండు టెర్ములు ఆయన పార్టీ గెలిచి సీఎం గా కూడా పనిచేశారు. అంతా బాగానే ఉంది కానీ ఏపీతో తనకు పని పడుతుందని, ఆంధ్రుల వద్దకు తానే రెక్కలు కట్టుకుని వాలాల్సి వస్తుందని కేసీయార్ కలలో కూడా ఊహించి ఉండరు. ఆయన బీజేపీ మీద కోపంతోనో లేక తెలంగాణాలో తన పార్టీ మూడవసారి గెలవడానికో లేక జాతీయ రాజకీయాల మీద మోజు తీర్చుకోవడం కోసమో బీయారెస్ ని పెట్టేశారు.

ఇపుడు ఆయనకు ఆంధ్రుల ఓట్లతో పని పడింది. ఆంధ్రులు తనకు మద్దతు ఇస్తేనే జాతీయ పార్టీగా బీయారెస్ కి ముద్ర పడుతుంది. తన కోరిక అలా నెరవేరుతుంది. దాని కోసం కేసీయార్ ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. అయితే ఆయన ఏపీకి వచ్చినపుడు అయిదు కోట్ల మంది ఆంధ్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. నిజానికి ఈ డిమాండ్ అన్ని రాజకీయ పార్టీలు చేయాలి. కానీ ఎందుకో ఆ పార్టీలు చేయడంలేదు. దానికి వారి కారణాలు వారికి ఉన్నాయి.

బీజేపీ ఎందుకు చేస్తోంది అంటే దాని కారణాలు దానికి ఉన్నాయి.బీజేపీనే కేసీయార్ టార్గెట్ చేశారు కాబట్టి ఏపీలో బీజేపీ కేసీయార్ ని అడ్డుకోవాలని చూస్తోంది. అందుకే కేసీయార్ క్షమాపణలు ముందు చెప్పి ఏపీలో అడుగుపెట్టు అని డిమాండ్ చేస్తున్నారు. కేసీయార్ ఉద్యమ కాలంలో తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు తలవంచి ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జీవీఎల్ గట్టిగా కోరుతున్నారు. ఏపీ ప్రజలు ఎవరూ కేసీయార్ తిట్లను మరచిపోలేదని ఆయన అన్నారు.

ఏపీ ప్రయోజనాలను కాలరాసిన వారు కేసీయార్ అని ఆయన దుయ్యబెట్టారు. ఏపెకి ద్రోహం చేసి ఎలా అడుగుపెడతారు అని ఆయన నిగ్గదీశారు. బీయారెస్ ఇక వీయారెస్ పుచ్చుకోవడమే తప్ప ఏపీలో ఏమీ సాధించేది ఉండదని ఆయన అంటున్నారు. అంతే కాదు తమ పార్టీ నుంచి ఎవరూ బీయారెస్ లోకి చేరేదే లేదని ఆయన స్పష్టం చేశారు. మరి కేసీయార్ ఏపీ ప్రజలకు క్షమాపణ చెబుతారు.

ఏమో రాజకీయాల్లో ఏదినా సాధ్యమే. అయితే కేసీయార్ లో రాజకీయ చాణక్యుడు ఉన్నారు. ఆయనకు ఈ రోజు ఏపీ ప్రజల అవసరం ఉంది. వారి ఆశీస్సులు నిండుగా కావాలి. అందువల్ల కేసీయార్ ఏపీ టూర్ లో తాను గతంలో మాటలు ఉద్యమ కాలంలో అన్నవి ఆ వేడిలో అన్నాను అని చెప్పినా చెప్పవచ్చు అని అంటున్నారు. సో కేసీయార్ అలా కనుక చేస్తే అపుడు బీయారెస్ దూకుడుని ఏపీలో ఎవరూ అడ్డుకోలేరు అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.