Begin typing your search above and press return to search.

ట్రంప్ విజ‌యానికి అస‌లు కార‌ణం ఇద‌ట‌

By:  Tupaki Desk   |   14 July 2017 6:51 AM GMT
ట్రంప్ విజ‌యానికి అస‌లు కార‌ణం ఇద‌ట‌
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య రీతిలో డొనాల్డ్‌ ట్రంప్ గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ విజయానికి ర‌ష్యా కారణమైందని ఇప్ప‌టికీ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనికంటే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మ‌రో కోణం తెర‌మీద‌కు వ‌చ్చింది. హిల్లరీ క్లింటన్‌ ను విమర్శిస్తూ వికీలీక్స్‌ బట్టబయలు చేసిన విషయాలే ట్రంప్ గెలుపున‌కు కార‌ణంగా మారిన‌ట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఎన్నికలకు రెండు నెలల ముందు ట్విట్టర్‌ పోస్టులను అధ్యయనం చేసిన లండన్‌ లోని ఎడిన్‌ బర్గ్‌ పరిశోధకులు ఈ విషయం స్పష్టం చేశారు.

ఎడిన్‌బ‌ర్గ్ అధ్య‌య‌నం ప్ర‌కారం సోషల్‌ మీడియాలో హిల్లరీని పొగిడిన వారి కంటే వికీలీక్స్‌ వంకతో తిట్టిన వారే ఎక్కువగా ఉన్నారు. అదే స‌మ‌యంలో ట్రంప్‌నకు మాత్రం తిట్టిన వారు, పొగిడిన వారు సమానంగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ట్రంప్‌ మద్ధతుదారులు ఆయన హామీలు, లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎక్కువగా ట్వీట్‌ చేస్తే, హిల్లరీ మద్ధతుదారులు మాత్రం ట్రంప్‌ మీద దుమ్మెత్తిపోసే ట్వీట్లే ఎక్కువగా చేశారని స్పష్టమైంది. ఎన్నికల వాదనల్లో ట్రంప్‌ ప్రదర్శనను నిందించారే తప్ప ఆయనకు సంబంధించిన వివాదాలను ఎవరూ తెరమీదకు తీసుకురాలేదని తేలింది. మరి హిల్లరీ క్లింటన్‌ విషయంలో మాత్రం వికీలీక్స్‌ ఆధారాలు ఆమె ఓటమికి, ట్రంప్‌ గెలుపునకు పరోక్షంగా కారణమయ్యాయని పరిశోధకులు వివరించారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరిట బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో కేఫ్‌ ఏర్పాటయింది. సైఫుల్‌ ఇస్లాం అనే వ్యాపారవేత్తకు ట్రంప్ అంటే విపరీతమైన అభిమానం. ఈ అభిమానంతోనే ఆయన రాజధానిలో ట్రంప్‌ కేఫ్‌ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధికారులు వెంటనే ఓకే చేయలేదు. ఈ కేఫ్‌ కు, అమెరికా అధ్యక్షుడుతో ఎలాంటి సంబంధం లేదని, తానే పూర్తి యజమానిని అని సైఫుల్‌ ఇస్లాం నిరూపించుకోవాల్సి వచ్చింది.