Begin typing your search above and press return to search.

హిల్ల‌రీపై షాకింగ్ బాంబు పేల్చిన వికీలీక్స్‌

By:  Tupaki Desk   |   1 Nov 2016 7:07 AM GMT
హిల్ల‌రీపై షాకింగ్ బాంబు పేల్చిన వికీలీక్స్‌
X
వ‌ద‌ల బొమ్మాళీ-టైపులో అమెరికా అధ్య‌క్ష బ‌రిలో ట‌ఫ్ పోటీనిస్తూ.. దాదాపు అధ్య‌క్ష పీఠం త‌న‌దే అనే రేంజ్‌ కి వెళ్లిపోయిన మాజీ విదేశాంగ మంత్రి హిల్ల‌రీ క్లింట‌న్‌ కి వికీలీక్స్ తాజాగా భారీ షాక్ ఇచ్చింది. వికీలీక్స్ రిలీజ్ చేసిన తాజా సంచ‌ల‌న‌మే క‌నుక నిజ‌మైతే.. హిల్ల‌రీ అడ్ర‌స్ గ‌ల్లంతేన‌నే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఇప్ప‌టికే హిల్ల‌రీ రిగ్గింగ్ చేయిస్తోంద‌ని - ఎన్నిక‌ల‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని - ఎన్నిక‌ల‌ను త‌ను న‌మ్మ‌న‌ని - త‌న మ‌నుషుల‌తో హిల్ల‌రీ బాంబు దాడి చేయించింద‌ని పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తున్న రిప‌బ్లిక‌న్ అధ్య‌క్ష అభ్య‌ర్థి డొనాల్ఢ్ ట్రంప్ కి వికీలీక్స్ వ్య‌వ‌హారం అందివ‌చ్చిన అవ‌కాశంగా చెబుతున్నారు. దీంతో ఆయ‌న మ‌రింత‌గా హిల్ల‌రీపై రెచ్చిపోవ‌డమే కాకుండా అస‌లు ఎన్నిక‌ల బ‌రి నుంచి హిల్ల‌రీ త‌ప్పుకోవాల‌ని కూడా డిమాండ్ చేసే ఛాన్స్ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. మ‌రి ఇంత‌కీ వికీలీక్స్ పేల్చిన ఆ బాంబు వ్య‌వ‌హారం ఏమిటో చూద్దాం..

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఉన్న సంప్ర‌దాయం ప్ర‌కారం తుది ద‌శ‌లో పోటీకి చేరువైన అభ్య‌ర్థులు ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో మూడు నుంచి నాలుగు చ‌ర్చ‌ల్లో పాల్గొని త‌మ త‌మ విధివిధానాల‌ను వివ‌రించాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల అధ్య‌క్ష బ‌రిలో పోటీ ప‌డుతున్న ట్రంప్‌ - హిల్ల‌రీలు సీఎన్ ఎన్ టీవీ నిర్వ‌హించిన చ‌ర్చా వేదిక‌కు వ‌చ్చారు. త‌మ త‌మ అభిప్రాయాలతో పాటు ఒక‌రి ఒక‌రు దుమ్మెత్తి పోసుకున్నారు. పబ్లిక్ చూస్తున్నార‌ని కూడా ప‌ట్టించుకోకుండా నోటికొచ్చిన‌ట్టు తిట్టుకున్నారు. ఇక‌, ఈ డిబేట్‌లో ఇరువురూ కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. వాటిని బ‌ట్టి కూడా నేత‌ల పాల‌నా శైలిని అమెరికా పౌరులు అంచ‌నా వేస్తారు.

అయితే, ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌ల వ్య‌వ‌హార‌మే హిల్ల‌రీ కొంప ముంచుతోంది. అత్యంత గోప్యంగా - స్టేజ్ మీద అంద‌రి ముందూ సంధించే ప్ర‌శ్న‌లకు అధ్య‌క్ష బ‌రిలో ఉన్న నేత‌లు స‌మాధానం చెప్పాలి. కానీ, ఈ ప్ర‌శ్న‌లు హిల్ల‌రీకి ముందుగానే తెలిసిపోయాయ‌ని, దీంతో ఆమె ముందుగానే ప్రిపేర్ అయి వ‌చ్చి వాటిని స‌మాధానాలు ఇచ్చార‌ని వికీలీక్స్ పెద్ద బాంబు పేల్చింది. ఇది ఓ రకంగా కొశ్చ‌న్ పేప‌ర్ లీక్ కావ‌డం వంటిదే. అంతేకాదు - ఈ కొశ్చ‌న్ పేప‌ర్ లీక్ చేసింది ఎవ‌రో కూడా వికీలీక్స్ బ‌య‌ట‌పెట్టింది. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ చైర్ పర్సన్ - ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత డోనా బ్రజిలే ఫెడ్ డిబేట్ ప్రశ్నలను క్లింటన్ కు ముందే అందిచారని వికీలీక్స్ తెలిపింది.

ఈ విష‌యం ఇప్పుడు అమెరికాలో పెను సంచ‌ల‌నం రేపుతోంది. దీనిపై హుటాహుటిన స్పందించిన ఫెడ్ డిబేట్ ను నిర్వహించిన సీఎన్ ఎన్ సంస్థ బ్ర‌జిలేపై చ‌ర్య‌లు తీసుకుంది. కంట్రిబ్యూట‌ర్‌ గా ఉన్న ఆమెతో రిజైన్ చేయించింది.
అయితే, ఆ డిబేట్ తాలూకు ప్ర‌శ్న‌లు ఎట్టి ప‌రిస్థితిలోనూ లీక్ అయ్యే ఛాన్స్ లేద‌ని సీఎన్ ఎన్ చెబుతోంది. మెటీరియల్ ప్రిపరేషన్ - బ్యాక్ గ్రౌండ్ ఇన్ ఫర్మేషన్ - టౌన్ హాల్ డిబేట్ మీటింగ్స్ ఇలా ఏ విషయాన్ని బ్రజిలేకు ఇవ్వలేదని సీఎన్ఎన్ అధికార ప్రతినిధి తెలిపారు. క్యాంపెయిన్ ఈవెంట్స్ లో భాగంగా యాహు న్యూస్ లైవ్ కవరేజ్ కోసం మాత్రమే ఆమె ఈ డిబేట్ కు అతిథిగా వచ్చారని చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై బ్రజిలే స్పందించడం లేదు. ఏదేమైనా ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు హిల్ల‌రీకి మైన‌స్‌ గా మారింద‌న్న టాక్ అమెరికాలో వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/