Begin typing your search above and press return to search.

నాకీ భర్త వద్దన్న కెల్లీ మే బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

By:  Tupaki Desk   |   5 Jun 2020 11:30 PM GMT
నాకీ భర్త వద్దన్న కెల్లీ మే బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?
X
ఒక్క వ్యక్తిని ఒక తెల్ల పోలీసు అన్యాయంగా చంపినందుకు అమెరికన్లు రగిలిపోతున్నారు. వారి ఆగ్రహం అగ్రరాజ్యాన్ని అట్టుడికిపోయేలా చేస్తోంది. అధికార అహంకారానికి విసిగిపోయిన అమెరికన్లు.. తమ స్వేచ్ఛ కోసం మాయదారి రోగాన్ని సైతం లెక్క చేయకుండా వీధుల్లోకి వస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు చేస్తున్నారు. కొందరి పోలీసుల దురహంకారాన్ని ప్రశ్నిస్తే.. వారిపై విరుచుకుపడుతున్నారు.

20 డాలర్ల నోటు నకిలీ అన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. సదరు పోలీసు వెనుకా ముందు చూడకుండా.. సదరు అనుమానితుడ్ని కిందకు తోసేసి.. అతడి మెడ మీద మోకాలి బలంగా ఉంచిన దుర్మార్గం.. ఒక మనిషి ప్రాణాన్ని తీసింది. ఊపిరి ఆడటం లేదు.. నేను చనిపోతా.. నన్ను వదలండంటూ వేడుకున్నా.. ఆ తెల్ల పోలీసులు గుండె కరకగలేదు. అమెరికాలో తీవ్ర సంచలనంగా మారిన నల్ల జాతీయుడి పాశవిక హత్యకు కారణమైన పోలీసు అధికారి పేరు డెరెక్ షువాన్.

ఈ ఉదంతంలో చనిపోయిన జార్జి ఫ్లాయిడ్ కు ఉన్నట్లే.. తెల్ల పోలీసు డెరెక్ షువాన్ కు కుటుంబం ఉంది. అతడికో భార్య ఉంది. ఆమె పేరు కెల్లీ మే. ఒకప్పుడు మిసెస్ మిన్సెసోటా అమెరికా టైటిల్ విజేతగా నిలిచిన ఆమె.. తర్వాతి కాలంలో డెరెక్ ను వివాహమాడింది. ఒక వ్యక్తిని అన్యాయంగా చంపేసిన తన భర్త తీరును ఆమె జీర్ణించుకో లేకపోతోంది. సగటు అమెరికన్ల మాదిరే ఆమె జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. ఈ దారుణానికి కారణమైన తన భర్తకు భారీ శిక్ష వేసేందుకు ఆమె సిద్ధమయ్యారు.

తన పేరు పక్కన తన భర్తగా ఉన్న వ్యక్తి పేరును అర్జెంట్ గా తొలగించాలని.. అతడితో బంధాన్ని తాను తెగతెంపులు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. పదేళ్ల తమ వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్న ఆమె.. వెంటనే తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతోంది. పైశాచికత్వంతో నేరం చేసిన తర్వాత కూడా.. తమ వారిని రక్షించుకునే వారికి భిన్నంగా కెల్లీ మే.. తన భర్తకు శిక్ష పడాలని కోరుకుంటోంది. అంతేకాదు.. విడాకుల తర్వాత తన భర్త నుంచి వచ్చే ఆస్తులు.. భరణాలు లాంటివేమీ అక్కర్లేదని.. తన బతుకు తాను బతుకుతానని స్పష్టం చేస్తోంది. తెల్లజాతీయులకు అహంకారం ఉంటుందనేది నిజమే అయినా.. అది పూర్తి నిజం కాదన్న విషయాన్ని కెల్లీ మే తన తీరుతో స్పష్టం చేసిందని చెప్పక తప్పదు.