Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ లోనూ వివాహేతర సంబంధంతో సినీఫక్కీలో హత్య

By:  Tupaki Desk   |   7 April 2020 9:40 AM IST
లాక్‌ డౌన్‌ లోనూ వివాహేతర సంబంధంతో సినీఫక్కీలో హత్య
X
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాలుస్తోంది. దానిపైనే ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. బయట రోడ్డుపై ప్రజలెవరూ పెద్దగా రావడం లేదు. ఈ క్రమంలోనే ఓ వివాహిత భర్తను సినీ ఫక్కీలో హత్య చేయించింది. ఇలాంటి సాధారణ రోజుల్లో జరిగితేనే ఆశ్చర్యపోతాం. అలాంటిది లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమలవుతున్న సమయంలో తన భర్తను తన ప్రేమికుడితో కలిసి హత్య చేయించడం ఆంధ్రప్రదేశ్‌ లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ హత్యకు కారణం వివాహేతర సంబంధమే. ప్రజలు ఇంటికి పరిమితమవడంతో ఈ హత్యోదంతంపైనే చర్చించుకుంటున్నారు. అలాంటి ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఏప్రిల్ 4వ తేదీ శనివారం రాత్రి చోటుచేసుకుంది.

పెద్దమండ్యం మండలం సిద్దవరం పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన బాలసుబ్రహ్మణ్యం (35) మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకను ప్రేమించి 11 ఏళ్ల కింద పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మదనపల్లెలో బాలసుబ్రహ్మణ్యం కొన్నాళ్లు గిఫ్ట్‌ దుకాణం నిర్వహించి నష్టపోయాడు. దీంతో రెండేళ్ల కిందట తిరుపతిలో ట్రావెల్స్‌ వ్యాపారం ప్రారంభించి ప్రస్తుతం అదే పని చేస్తున్నాడు. అయితే రేణుక మాత్రం ముగ్గురు పిల్లలతో మదనపల్లెలో నివసిస్తోంది. భర్త తిరుపతిలో ఉంటుండడంతో మదనపల్లెలో ఉంటున్న రేణుకకు ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కె.నాగిరెడ్డితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే అతడితో సంబంధం కొనసాగేందుకు ఆ పార్టీలో కార్యకర్తగా చేరింది. దీంతో పార్టీలో తిరుగుతూనే ఆమె అతడికి సన్నిహితంగా మారింది. అయితే ఇటీవల భర్త బాలసుబ్రహ్మణ్యం మదనపల్లె వచ్చేశాడు. భర్త తిరుపతికి వెళ్లడం మానేసి మదనపల్లెలో భార్యాపిల్లలతో ఉంటున్నాడు. ఈ క్రమంలో నాగిరెడ్డిని కలవడానికి అవకాశం కష్టంగా మారింది. పార్టీ కార్యక్రమాల పేరుతో రేణుకు బయటకు వచ్చి నాగిరెడ్డితో బంధం కొనసాగిస్తోంది.

అయితే ఈ విషయం తెలుసుకున్న భర్త రేణుకను హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా ఆమె వినిపించుకోలేదు. ప్రియుడి మోజులో ఉన్న ఆమె భర్త మాటలను లెక్క చేయలేదు. నాగిరెడ్డిని కలవడానికి భర్త అంగీకరించకపోవడంతో అతడిపై కక్ష పెంచుకుంది. భర్తను అడ్డు తొలగించుకుంటే తమ బంధానికి అడ్డు ఉండదని ఆమె భావించింది. ఈ క్రమంలో తన భర్తను చంపేయాలని నాగిరెడ్డికి చెప్పింది. దీంతో అతడు బాలసుబ్రహ్మణ్యం హత్యకు వ్యూహం సిద్ధం చేశాడు. కొన్ని రోజులుగా మంచి అదును కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే బాలసుబ్రహ్మణ్యానికి జలుబు వచ్చింది. జలుబు తీవ్రమవడంతో ఏప్రిల్‌ 4వ తేదీ శనివారం రాత్రి 11గంటల సమయంలో మాత్రలు తెచ్చుకోవాలని రేణుక భర్తను బలవంతంగా బయటకు పంపించింది. ఎంత వద్దని చెప్పినా భార్య బలవంతం చేయడంతో బాలసుబ్రహ్మణ్యం బయటకు వచ్చాడు. అలా భర్త బయటకు వచ్చాడో లేదు వెంటనే రేణుక ప్రియుడు నాగిరెడ్డికి ఫోన్ చేసి విషయం తెలిపింది. మందులు తీసుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా పథకం ప్రకారం నాగిరెడ్డి లారీతో అతడిని ఢీకొట్టించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలసుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మరణించాడు. భర్త మరణంతో రేణుకు బోరున విలపిస్తూ నటించింది. ఏమీ తెలియదని నటిస్తోంది. అయితే అర్థరాత్రి అతడు ప్రమాదంలో మృతిచెందడంతో మృతుడి సోదరుడు రఘుపతి న్యాయవాది కావడంతో తన మరణాన్ని ప్రమాదం కాదని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో తన అన్న మృతిపై అనుమానులున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకుని రంగంలోకి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో భార్య రేణుకను తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో ఈ హత్య వివరాలు వెల్లడయ్యాయి. దీంతో పాటు రేణుక - నాగిరెడ్డి మధ్య వివాహేతర సంబంధం కూడా బహిర్గతమైంది. రేణుక - నాగిరెడ్డితో పాటు లారీ డ్రైవర్‌ - యజమాని తదితరులను అరెస్ట్‌ చేశారు. ఇలాంటి ఘటన లాక్‌ డౌన్‌ సమయంలో చోటుచేసుకోవడంతో మరింత సంచలనంగా మారింది.