Begin typing your search above and press return to search.

గుంటూరు : కర్రతో కొట్టి.. భర్తను చెట్టుకు కట్టేసి భార్యను గ్యాంగ్ రేప్

By:  Tupaki Desk   |   10 Sept 2021 9:29 AM IST
గుంటూరు : కర్రతో కొట్టి.. భర్తను చెట్టుకు కట్టేసి భార్యను గ్యాంగ్ రేప్
X
ఆరాచకానికి పరాకాష్ఠ లాంటి ఉదంతం ఒకటి ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. విన్నంతనే రక్తం మరిగిపోయేలా.. అలాంటి త్రాష్టుల్ని ఏం చేసినా తప్పు లేదన్న భావన కలిగే వైనం తాజాగా చోటు చేసుకుంది. ఆ మధ్యన కృష్ణానది ఘాట్‌లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనను గుర్తుకు తెచ్చే ఈ వైనం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఒక శుభకార్యానికి హాజరైన దంపతులు ఇద్దరు బండి మీద వెళుతున్న వేళ.. అటకాయించి.. దారుణంగా కొట్టి.. భర్తను చెట్టుకు కట్టేసి భార్యను గ్యాంగ్ రేప్ చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. గుంటూరు పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకున్న ఈ దారుణంలో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయని వైనం వివాదాస్పదంగా మారింది. అయితే.. దీనిపై వారి వివరణ వేరేగా ఉంది.

గ్యాంగ్ రేప్ నకు పాల్పడటమే కాదు.. అదే మార్గం మీదుగా వెళ్లే వారిపై దాడులకు పాల్పడి..దోపిడీలు చేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే.. సత్తెనపల్లికి చెందిన దంపతులు మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో జరిగిన ఒక ఫంక్షన్ కు హాజరయ్యారు. భర్తకు 30 ఏళ్లు కాగా.. భార్యకు 26 ఏళ్లు. రాత్రి 9.45 గంటలకు వారు ఇంటికి బయలుదేరగా.. రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత.. వారికి రోడ్డుకు అడ్డంగా వేసి ఉంచిన చెట్టు కొమ్మ ఎదురుపడింది. దానిపై నుంచి వాహనాన్ని పోనివ్వగా.. గుర్తు తెలియని కొందరు కర్ర అడ్డం పెట్టి బైక్ మీద వెళుతున్నదంపతుల్ని కిందపడేశారు. వారిపై పిడిగుద్దులు గుద్ది.. తీవ్రంగా గాయపరిచారు.

అనంతరం కొడవళ్లు చూపించి చంపేస్తామని బెదిరించారు. సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు. ఆ దారిన వెళ్లే వారికి తాము చేసే అరాచకం గురించి అనుమానం కలగకుండా ఉండేందుకు వీలుగా.. బైకును పొలాల్లోకి దించేశారు. భర్తను చెట్టుకు కట్టేశారు. అనంతరం ఇద్దరు అతనికి కాపలాగా ఉండగా.. మరో ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మిగిలిన వారు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా 12.40 గంటల వరకు నరకం చూపించి.. భార్యభర్తలిద్దరినీ తీవ్ర చిత్రహింసల పాలు చేశారు. అనంతరం బాధితురాలి మెడలో మంగళసూత్రం.. చెవిదిద్దులు.. వెండి కాళ్లపట్టీలు.. రూ.5వేల నగదు దోచుకొని.. ఎవరికైనా విషయం చెబితే చంపేస్తామంటూ కొడవళ్లతో బెదిరించారు.

ఎవరికి చెప్పమని బాధితులు చెప్పిన తర్వాత వారిని వదిలిపెట్టారు. వారికి ఒక ఫోన్ నెంబరు కూడా ఇచ్చారు. అది మధ్యప్రదేశ్ నెంబరుగా గుర్తించారు. ఆగంతుకులు ముఖానికి మాస్కులు ధరించినట్లు చెబుతున్నారు. ఈ దారుణానికి పాల్పడిన నలుగురిలో ముగ్గురు తెలుగులో మాట్లాడగా.. ఒకడు మాత్రం హిందీలో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. బాధితుల కథనం ప్రకారం వారు బయట ప్రాంతానికి చెందిన వారై ఉంటారని చెబుతుంటే.. పోలీసులు మాత్రం స్థానికులే అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ ఘటన అనంతరం బాధిత దంపతులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

అర్ధరాత్రి ఒంటి గంట సమయానికి సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళితే.. వారి నుంచి సమాచారం తీసుకొని జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పోలీసులు.. ఈ ఘటన తమ పరిధిలోకి రాదంటూ మేడికొండూరు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వటం.. వారు స్పందించి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి.. తమ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ కేసు నమోదు చేశారు. ఇదంతా జరగటానికి పట్టిన సమయానికి దుండగులు పారిపోయే అవకాశం కలిగిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

దారుణం జరిగిన ప్రాంతానికి అర కిలోమీటరు దూరంలో ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మాణం జరుగుతోంది. అక్కడ ఒడిశా.. శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారితో పాటు స్థానికులు కూడా పని చేస్తున్నారు. క్లూస్ టీంతో పాటు డాగ్ స్వ్కాడ్ ను రంగంలోకి దింపారు. బాధితురాలిని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించి.. వైద్య సేవలు అందిస్తున్నారు.

పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి. సత్తెనపల్లి పోలీసులు బాధితుల ఫిర్యాదుకు స్పందించి మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారని.. వారు స్పందించి కేసు నమోదు చేశారని.. ఇదంతా ఆరేడు నిమిషాల వ్యవధిలోనే జరిగిందన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంలో నిజం లేదన్నారు. తాము సరైన రీతిలో స్పందించామని చెప్పటానికి అవసరమైన టెక్నికల్ ఎవిడెన్సు తమ వద్ద ఉన్నాయని పేర్కొనటం గమనార్హం. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.