Begin typing your search above and press return to search.

కాపు నేతలను వైసీపీ ఎందుకు దూరం చూసుకుంటోంది?

By:  Tupaki Desk   |   24 Jan 2019 5:53 PM IST
కాపు నేతలను వైసీపీ ఎందుకు దూరం చూసుకుంటోంది?
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వంగవీటి రాధా కు తెలుగుదేశం పార్టీ ఏమీ ఆయన కోరిన నియోజకవర్గాన్ని కేటాయించడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయవాడ సెంట్రల్ సీటును కోరాడు వంగవీటి. అయితే ఆ సీటును మల్లాది విష్ణుకు కేటాయించాడు వైకాపా అధినేత జగన్. అక్కడకూ మచిలీపట్నం ఎంపీ టికెట్ ను వైసీపీ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వంగవీటి మాత్రం వైకాపాను వీడాడు. అలాగని తెలుగుదేశం పార్టీలో కోరిన సీటు దక్కలేదు. ఎమ్మెల్సీ నామినేషన్ ను ఇస్తారట.

మరి ఇదే పని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు అనేది ప్రశ్న. ఒకవేళ వంగవీటి రాధాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఎమ్మెల్సీ సీటును ఆఫర్ చేసి ఉంటే.. ఆయన కామ్ అయ్యే వాడేమో! ఎంపీ టికెట్ కాకుండా.. నామినేటెడ్ పదవిని ఇస్తామని వైసీపీ ఆయనకు ఆఫర్ చేసిందో లేదో కానీ.. ఆయన అయితే వైకాపాను వీడాడు. తెలుగుదేశం పార్టీలో ఆయనకు విజయవాడ సెంట్రల్ టికెట్ దక్కకపోయినా.. ఎన్నికల ముందు తెలుగుదేశం ఈ చేరికను తనకు సానుకూలంగా ఉపయోగించుకుంటుంది.

కాపు నేతలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి కాపులు చాలా వరకూ దూరం అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి పరిణామాలను తెలుగుదేశం అనుకూలంగా వాడుకునే అవకాశం ఉంది. దూరం అయిన కాపు ఓటర్లను దగ్గర చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు సాగించడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడుతోంది.

రాష్ట్రంలో కాపు ఓటర్ల శాతం పదహారు. వీరిలో కొంతశాతం పవన్ కల్యాణ్ వైపు మొగ్గు చూపవచ్చు. అయితే అందరూ కాదు. పవన్ కల్యాణ్ ను సినీ రంగం పరంగా అభిమానించే వాళ్లు కూడా.. రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిలబడే పరిస్థితి ఉంది. అయితే కాపు లీడర్లను నియంత్రించుకోవడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంత వరకూ సఫలం కాలేకపోతోంది.

వైకాపాలో చాలా మంది కాపు లీడర్లు ఉన్నా.. ఎన్నికల ముందు ఎవరూ చేజారకుండా చూసుకోవాల్సింది. వంగవీటి రాధా వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం.. అంటే, ఇన్ని రోజులూ తెలుగుదేశం పార్టీనే తన తండ్రిని హత్య చేయించిందని చెప్పిన వ్యక్తి టీడీపీలోకి వెళ్లడం అంటే.. అది వైసీపీ ఫెయిల్యూర్ కూడా అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేల్కొంటుందా, ఆఖరి నిమిషంలో వలసలకు అడ్డుకట్ట వేస్తుందా? చూడాలిక!